క్రీడల్లో గెలుపోటములు సహజం | - | Sakshi
Sakshi News home page

క్రీడల్లో గెలుపోటములు సహజం

Apr 6 2026 7:54 AM | Updated on Apr 6 2026 7:54 AM

రాయచూరు రూరల్‌: క్రీడల్లో గెలుపోటములు సహజం. క్రీడాకారులు గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించాలని వేంకటేశ్వర కళాశాల అధ్యక్షుడు సంతోష్‌ రాజ్‌ సూచించారు. ఆదివారం వేంకటేశ్వర కళాశాల క్రీడా మైదానంలో క్రికెట్‌ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానసికంగా, శారీరకంగా, దైహికంగా అభివృద్ధి చెందడానికి క్రీడలు దోహదపడుతాయని పేర్కొన్నారు. క్రీడాకారులు క్రీడల్లో సత్తా చాటి ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆకాక్షించారు. అనంతరం గెలుపొందిన జట్టుకు ట్రోఫీ అందజేశారు. కార్యక్రమంలో చిదానంద, అక్షయ్‌ కుమార్‌, మహేష్‌, సతీష్‌, శరణప్ప అమరేష్‌, హన్మంతు తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన ఆరాధన ఉత్సవాలు

రాయచూరు రూరల్‌: మంత్రాలయంలో సుశీమింద్ర తీర్థుల ఆరాధన ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. శనివారం రాత్రి రాఘవేంద్ర స్వాముల మఠంలో పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీ పాదంగల్‌ ప్రత్యేక పూజలు చేశారు. ఆరాధనకు తరలివచ్చిన వందలాది మంది భక్తుల సమక్షంలో రాఘవేంద్ర స్వామికి తెపోత్సవం నిర్వహించారు. అనంతరం రాయచూరుకు చెందిన శేషగిరి దాస్‌ ఆధ్వర్యంలో గాన కచేరీ, భక్తిగీతాలన చేపట్టారు.

శాంతియుత వాతావరణం నెలకొల్పడమే లక్ష్యం

హొసపేటె: సమాజంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందిన ఆనంద్‌ గురూజీ తెలిపారు. ఆదివారం నగరంలో మారికాంబిక గ్రామీణ అభివృద్ధి, మహిళా శక్తి సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. తొలుత సన్నిక్కి వీరభద్రేశ్వర స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన హోమంలో ఆనంద్‌ గురూజీ పాల్గొని పూజలు చేశారు. వేద మంత్రోచ్ఛారణలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. లోక కళ్యాణం, వర్షాలు సమృద్ధిగా కురిసి, ప్రజలందరికీ ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని స్వామిజీ ఆశీర్వదించారు. ముఖ్యంగా సమాజంలో శాంతియుత వాతావరణం నెలకొల్పడమే ఈ హోమం ఉద్దేశమని తెలిపారు. హోమం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. స్వామిజీ ఆశీస్సులు పొందేందుకు భక్తులు క్యూకట్టారు.

‘కుమారుడిని

ఇండియాకు తీసుకు రండి’

రాయచూరు రూరల్‌: జీవనోపాధి కోసం ఖతార్‌ వెళ్లిన తమ కుమారుడిని ఇండియాకు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని బీదర్‌ తాలుకా బక్‌చౌడికి చెందిన శాంతాబాయి కోరింది. ఆదివారం బీదర్‌ దక్షిణ శాసన సభ్యుడు డా.శైలేంద్ర బెల్దాళ్‌ను కలసి సమస్యను విన్నవించింది. ప్రస్తుతం మధ్యప్రాచ్య దేశాల మధ్య యుద్ధం జరుగుతుండటంతో తమ కుమారుడు అమర్‌ అక్కడే చిక్కుకుని పోయాడని ఆవేదన వ్యక్తం చేసింది. అక్కడే యుద్ధ ప్రభావం ఎక్కువ ఉండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదన్నారు. శాసన సభ్యుడు శైలేంద్ర స్పందిస్తూ.. ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హమీ ఇచ్చారు.

బాలల కోసం వేసవి శిబిరం

కోలారు: కోలారు క్రీడా సంఘం ఆధ్వర్యంలో వేసవి క్రీడా శిబిరాన్ని అంబేడ్కర్‌ ఉద్యానవనంలో ప్రారంభించారు. కోలారు కృషి కేంద్రం ప్రముఖుడు శివానంద హొంగల మాట్లాడుతూ పిల్లలకు పశువుల పెంపకం, గొర్రెల పెంపకం, వ్యవసాయం, సీడ్‌ బాల్‌ తయారు గురించి తెలియజేస్తామన్నారు. వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ పరమేశ్వర్‌ మాట్లాడుతూ.. నేడు పిల్లలు మట్టి వాసనను మరిచిపోయారని వారికి మన మట్టి ఘమఘమల గురించి తెలియజేయాల్సి ఉందని అన్నారు. పాత్రికేయుడు కెయస్‌ గణేష్‌ బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఓం శక్తి చలపతి, సామా అనిల్‌ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement