హోసూరు: ముందు వెళ్తున్న లారీని వెనుక వెళ్తున్న మరో లారీ ఢీకొన్న ప్రమాదంలో క్లీనర్ మృతి చెందిన ఘటన సిఫ్‌కాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల మేరకు.. వేలూరు జిల్లా గుడియాత్తం ప్రాంతానికి చెందిన లోకేష్ (28) క్లీనర్‌గా పని చేస్తున్నాడు. వాణియంబాడికి చెందిన డ్రైవర్ లింగేశ్వరన్ లారీని నడుపుతుండగా పక్కనే లోకేష్ కూర్చొన్నాడు. శనివారం సాయంత్రం బెంగళూరు–హోసూరు జాతీయ రహదారిపై లారీలో వెళ్తుండగా.. దర్గా సమీపంలో ముందు వెళ్తున్న లారీ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో లోకేష్ తీవ్రంగా గాయపడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సిఫ్‌కాట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.
ఉరివేసుకుని హెడ్‌కానిస్టేబుల్ ఆత్మహత్య
హోసూరు: విధులు ముగించుకుని ఇంటికెళ్లిన హెడ్‌కానిస్టేబుల్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల మేరకు.. క్రిష్ణగిరి సమీపంలోని పెద్దదాళపల్లి గ్రామానికి చెందిన విజయ్ కుమార్ (40). మహారాజగడ పోలీస్ స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. ఈనెల 3వ తేదీ విధులు ముగించుకుని ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు గది తలుపులు తెరిచి చూడగా విజయ్‌కుమార్ ఉరికి వేలాడుతూ కనిపించాడు. భార్య భారతి వెంటనే క్రిష్ణగిరి తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని ఆత్మహత్యకు కారణాలపై విచారణ జరుపుతున్నారు.
ప్రశాంతంగా సాక్షరతా పరీక్షలు
కోలారు: కేంద్ర ప్రభుత్వ ఉల్లాస్ నవ భారత సాక్షరతా కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా మొత్తం 23 గ్రామ పంచాయతీల వ్యాప్తిలో 189 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన సాక్షరతా పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయి. 6 వేల మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేసే లక్ష్యంతో మూల సాక్షరతా కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగిందని జిల్లా సాక్షరతా అధికారి ఉమా తెలిపారు. ఆదివారం నిర్వహించిన పరీక్షకు 6 వేల మంది హాజయ్యారని తెలిపారు. బంగారుపేట తాలూకాలో 4 గ్రామ పంచాయతీల 26 పరీక్షా కేంద్రాల్లో 1,000 మంది, కెజీఎఫ్ తాలూకాలో 3 గ్రామ పంచాయతీల్లోని 5 పరీక్షా కేంద్రాల్లో 250 మంది, కోలారు తాలూకాలోని 13 గ్రామ పంచాయతీల్లోని 74 పరీక్ష కేంద్రాల్లో 1,750 మంది, మాలూరు తాలూకాలో 4 గ్రామ పంచాయతీల్లోని 35 కేంద్రాల్లో 1,000 మంది, ముళబాగిలు తాలూకా 6 గ్రామ పంచాయతీల్లోని 46 పరీక్ష కేంద్రాల్లో 1,750 మంది, శ్రీనివాసపురం తాలూకాలో 2 పరీక్షా కేంద్రాల్లో 250 మంది పరీక్షలు రాశారని అధికారులు వెల్లడించారు.


