బొమ్మనహళ్లి: హాసన్ జిల్లాలోని శిల్పా కళా నిలయం బేలూరులో శ్రీ చన్నకేశవ స్వామి రథోత్సవంలో భాగంగా శుక్రవారం రాత్రి తెప్పోత్సవం రమణీయంగా జరిగింది. విష్ణు సముద్రం అనే పుష్కరిణిలో తెప్పోత్సవం సాగింది. స్వామివారు, శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా పుష్పాలతో అలంకరించి, మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల ఘోషతో ఆలయ అష్ట వీధుల గుండా ఊరేగింపు సాగించారు. ఆ తర్వాత కళ్యాణిలో సుందరంగా తీర్చిదిద్దిన పడవలో ఆసీనుల్ని చేసి విహరింపజేశారు. స్వామివారి వైభవాన్ని తిలకించి భక్తజనం పునీతులయ్యారు.
ప్లాటు పేరుతో రూ.29 లక్షల బురిడీ
మైసూరు: సొసైటీ ద్వారా తక్కువ ధరకే స్థలం ఇస్తామని చెప్పి ఓ వ్యక్తి నుంచి రూ.29.59 లక్షలు కట్టించుకుని మోసగించారని ఆరోపించాడు. వివరాలు.. మైసూరులోని సోమనాథనగర నివాసి వై.పురోహిత్ అలకనంద అనే వ్యక్తి సంకల్ప వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు వేదమూర్తి, ఉపాధ్యక్షుడు ఎం.బీ.పరమేష్ ఆరాధ్యతో పాటు సొసైటీకి చెందిన ఏడుగురిపై ఈ మేరకు లక్ష్మిపురం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. వరకోడు వద్ద చవగ్గా ప్లాటు ఇస్తామనడంతో నమ్మి దశల వారీగా సొసైటీకి రూ.29.59 లక్షలను చెల్లించానని తెలిపాడు. కానీ ఎలాంటి స్థలాన్ని రిజిస్టర్ చేసివ్వలేదన్నారు. సొసైటీ ఆఫీసుకు వెళ్లగా సొసైటీ అనేది అసలు నమోదు కాలేదని తెలిసిందన్నారు. మోసాలకు పాల్పడుతున్న వీరిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరాడు.
బస్సులో రూ.18 లక్షల నగలు మాయం
మైసూరు: లాకర్‌లో నుంచి నగలను తీసుకుని సిటీ బస్సులో వెళ్తున్న ఓ మహిళ నుంచి రూ.18 లక్షల విలువ చేసే బంగారు నగలను దొంగలు చోరీ చేసిన ఘటన మైసూరులో జరిగింది. రామకృష్ణనగర నివాసి హేమలత అశోక సర్కిల్ వద్ద ఉన్న కెనరా బ్యాంకు లాకర్‌లో భద్రపరిచిన 262 గ్రాముల బంగారు ఆభరణాలను తీసుకున్నారు. అశోక్ సర్కిల్ బస్టాండ్ నుంచి రామకృష్ణనగరకు వెళ్లేందుకు సిటీ బస్సును ఎక్కారు. బస్సు వెళ్తున్న సమయంలో దొంగలు ఆమె బ్యాగ్‌లో ఉన్న బంగారు నగలను చోరీ చేశారు. బస్సు నుంచి దిగిన తర్వాత హేమలత బ్యాగ్‌ను చూసుకోగా నగలు లేవు, కువెంపునగర ఠాణాలో ఫిర్యాదు చేశారు.
మణికుప్పె హనుమాన్ రథోత్సవం
తుమకూరు: జిల్లాలోని గుబ్బి తాలూకా సీఎస్‌పుర ఫిర్కాలో పురాణ ప్రసిద్ధ మణికుప్పె నరసింహ ఆంజనేయ స్వామి రథోత్సవం శనివారం మధ్యాహ్నం ఘనంగా జరిగింది. పూజల తరువాత స్వామివారి విగ్రహాన్ని ఊరేగింపుగా తెచ్చి రథంలో ప్రతిష్టించారు. జై ఆంజనేయ అంటూ తేరును లాగగానే భక్తులు తేరు మీదకు ధవనం, అరటిపండ్లు విసిరారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు వచ్చారు. ఎమ్మెల్యే ఎంటీ కృష్ణప్ప, మాజీ ఎమ్మెల్యే మసాలా జయరాం పాల్గొన్నారు.
ముడిచమురు షేర్లంటూ రూ.18 లక్షలు టోపీ
మైసూరు: షేర్ మార్కెట్‌లో లాభాల పేరుతో మైసూరువాసులకు సైబర్ నేరగాళ్లు తరచూ వంచిస్తూనే ఉన్నారు. ఇలాగే ఓ మహిళ రూ.18 లక్షలను కోల్పోయింది. విజయనగర 3వ స్టేజీ నివాసి అయిన మహిళ యూట్యూబ్‌లో షేర్ మార్కెట్ ప్రకటనను చూశారు. అందులోని సమాచారం మేరకు ఆమె కాల్ చేశారు. వీర్ రావత్ అనే వ్యక్తి మాట్లాడుతూ ప్రస్తుత యుద్ధ పరిస్థితుల్లో ముడి చమురు కంపెనీల షేర్లలో ఎక్కువ డబ్బు పెట్టుబడి పెడితే కోట్లాది రూపాయలు సంపాదించుకోవచ్చని నమ్మించాడు. అతని మాటలను నమ్మిన ఆ మహిళ దశలవారీగా అతను చెప్పిన ఖాతాలకు రూ.18 లక్షలను బదలాయించి మోసపోయింది. సైబర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.


