బళ్లారిఅర్బన్: దావణగెరె అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి శామనూరు సమర్థ్ తరపున శనివారం కరూరు గ్రామంలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దావణగెరె ఎంపీ ప్రభా మల్లికార్జున్ పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ఓటర్లను కోరారు. గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేసిన నాయకులు, అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ హామీలను వివరించారు. ప్రచారంలో బళ్లారి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అల్లం ప్రశాంత్, కేపీసీసీ కో–ఆర్డినేటర్ వెంకటేశ్ హెగ్డే, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బోయపాటి విష్ణువర్ధన్, ఉపాధ్యక్షుడు కే.శ్రీనివాసులు, సోషల్ మీడియా జిల్లా అధ్యక్షుడు అఫాక్ అహ్మద్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు వీరసేనా రెడ్డి, జగదీశ్, దివాకర్ గౌడ, పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేశారు.
భక్తిశ్రద్ధలతో నాగదేవతల ప్రతిష్టాపన
బళ్లారిఅర్బన్: నగరానికి సమీపంలోని గుగ్గరహట్టిలో వెలసిన పాండురంగ స్వామి ఆలయంలో నాగదేవతల ప్రతిష్టాపన పూజ విశేష వేడుకలు శనివారం భక్తిశ్రద్ధలతో నెరవేర్చారు. ప్రముఖులు ఓబులేష్, లక్ష్మి దంపతుల సారథ్యంలో తెల్లవారు జాము నుంచి విశేష పూజలతో పాటు వివిధ అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా ఆ దంపతులు మాట్లాడుతూ ఎంతో కాలంగా పాండురంగ స్వామి గుడిలో నాగదేవతల ప్రతిష్ట చేయాలని అనుకున్నామన్నారు. ఇన్నాళ్లకు స్వామి కరుణతో ఈ వేడుకలు గ్రామ ప్రముఖులు, భక్తుల మధ్య ఎంతో భక్తిప్రపత్తులతో నెరవేరినందుకు సంతోషంగా ఉందన్నారు. ప్రతి విశేష సందర్భాల్లో భక్తులకు తాము ఈ ఆలయంలో విశేష పూజ సేవా కార్యక్రమాలను నెరవేరుస్తుంటామని. స్థానికులు తమకు అన్ని విషయాలలో ఎంతో సహకరిస్తుంటారన్నారు.
దారిలో షెడ్‌ను తొలగించరూ
రాయచూరు రూరల్: రాయచూరు తాలూకా బాపురలో దారికి అడ్డంగా నిర్మించిన టిన్ షెడ్‌ను తొలగించాలని కర్ణాటక ప్రాంత రైతు సంఘం డిమాండ్ చేసింది. శనివారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు వీరేష్ మాట్లాడారు. గ్రామంలో ఆంజనేయ దేవస్థానం నుంచి చేద బావి వరకు ఉన్న కాలు దారికి అడ్డంగా అక్రమంగా నిర్మించిన టిన్‌షెడ్‌ను తొలగించాలని కోరారు. బంద్ చేసిన దారిలో తిరిగి ప్రజలు సంచరించడానికి అవకాశం కల్పించాలని కోరుతూ జిల్లాధికారి నితీష్‌కు వినతిపత్రం సమర్పించారు.
వేసవిలో తాగునీటి ఎద్దడి రానీయొద్దు
రాయచూరు రూరల్: వేసవిలో మూడు నెలల పాటు జిల్లాలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా జాగ్రత్త వహించాలని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖా మంత్రి బోసురాజు అధికారులకు సూచించారు. శుక్రవారం మాన్వి తాలూకా పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తుంగభద్ర నదీ తీర గ్రామాలకు నీటి సరఫరాలో జాప్యం నెలకొనకుండా చూడాలన్నారు. గ్రామాలకు నీటి సరఫరా చేపట్టాలన్నారు. విద్యుత్ కోత, మోటార్లు చెడిపోవడం, ఇతరత్ర వంటి కారణాలు చెప్పకుండా నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. తుంగభద్ర ఎడమ కాలువకు నీరు విడుదల చేసినందున గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు, నీటి కుంటలను నింపేలా పీడీఓలకు ఆదేశాలు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.


