రాయచూరు రూరల్: తాలుకాలోని పలకన మరడి గ్రామంలో గురువారం రాత్రి ఆంజనేయ స్వావి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. వేలాది మంది భక్తుల సముక్షంలో రథోత్సవం లాగారు. తొలుత శాంతమల్ల శివాచార్యులు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆంజనేయుడిని రథంపై కొలువుదీర్చారు. భారీగా తరలివచ్చిన భక్తులు రథాన్ని లాగి మొక్కులు చెల్లించుకున్నారు. నగరంలోని గాంధీ సర్కిల్, ఐబీ కాలనీలో ప్రత్యేక పూజలు జరిపారు.
నరేగ పనుల పర్యవేక్షణ
రాయచూరు రూరల్: జిల్లాలో కొనసాగుతున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగ) పనుల పర్యవేక్షణకు కేంద్ర ప్రభుత్వం బృందాలను ఏర్పాటు చేసింది. శుక్రవారం కేంద్ర బృందం అధికారులు రాయచూరు తాలుకాలో పర్యటించారు. జిల్లా పంచాయతీ యోజన అధికారి శరణ బసవ ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. పనులు ఎలా ఉన్నాయి? కూలి సకాలంలో అందుతుందా లేదా అని ఉపాధి హామీ కూలీలను అడిగి తెలుసుకున్నారు. కర్ణాటక, తెలంగాణ, చత్తీస్‌ఘడ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో కూడా పర్యటించినట్లు గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ బాలమురళి వివరించారు. కార్యక్రమంలో అధికారులు శివశంకర్, అవనేంద్ర కుమార్ పాల్గొన్నారు.
జనగణనకు సిద్ధం కండి
రాయచూరు రూరల్: 2027 నాటికి దేశ వ్యాప్తంగా 16వ జనాభా లెక్కల సేకరణను ప్రభుత్వం పూర్తి స్థాయిలో డిజిటల్ పద్ధతిలో నిర్వహించనుంది. జనాభా లెక్కల సేకరణకు అధికారులు సిద్ధం కావాలని జిల్లా అధికారి నితీష్ పేర్కొన్నారు. శుక్రవారం పండిత సిద్ధరామ జంబల దిన్ని రంగ మందిరంలో గ్రామీణ నియోజక వర్గంలోని ఉపాధ్యాయులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులు గ్రామ స్థాయిలో ఇంటింటికీ వెళ్లి జనాభా వివరాలు సేకరించాలని సూచించారు. రెండు విడతల్లో జన గణన ఉంటుందని వివరించారు. మొదటి విడత ఏప్రిల్ 16 నుంచి మే 15 వరకు, రెండో విడత 2027 పిభ్రవరిలో గణన చేయాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో ఇంటింటి వెళ్లి వార్డుల వారీగా జనాభా వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార కాందూ, సదాశివప్ప, సుదర్శన్, మల్లేష్ నాయక్, బసవరాజ్, వనిత, పురురాజ్ సోలంకి, బడిగేర, ఈరణ్ణ కోస్గి పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో గుడ్‌ఫ్రైడే
రాయచూరు రూరల్: నగరంలో శుక్రవారం గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. మెథడిస్ట్ ఇతర చర్చీల్లో పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఏసుక్రీస్తు బోధనలు వింటూ సంగీత లహరి ఏర్పాటు చేయడం జరిగింది.
ఎస్‌ఐపై సస్పెన్షన్ వేటు
హొసపేటె: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మునిరాబాద్ ఎస్‌ఐ సునిల్‌ను సస్పెండ్ చేస్తూ కొప్పళ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ రామ్ అరసిద్ధి ఉత్తర్వులు జారీ చేశారు. గత రెండేళ్లుగా మునిరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐగా నిధులు నిర్వర్తిస్తున్న సునిల్.. ఇటీవల తన పరిధిలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనల కారణంగా వెలుగులోకి వచ్చారు. విదేశీయుల పార్టీలు, అక్రమ రాతి తవ్వకాలు, అన్నభాగ్య బియ్యం అక్రమ విక్రయం తదితర కేసులు నమోదయ్యాయి. బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించక పోవడంతో ఎస్‌ఐ సునీల్‌ను సస్పెండ్ చేశారు.
తాగునీటి ఎద్దడి తలెత్తనీయొద్దు
రాయచూరు రూరల్: వేసవి కాలం ప్రారంభం కావడంతో జిల్లాలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్ కాందూ ఆదేశించారు. శుక్రవారం జిల్లా పంచాయతీ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తుంగభద్ర నీటిపై ఆధారపడిన గ్రామాలకు నీటి సమస్య రాకుండా చూసుకోవాలన్నారు. నీటి సరఫరాలో జాప్యం ఉండకూడదన్నారు. కృష్ణా నదీ ప్రాంత పరిధిలోని గ్రామాలకు నిరంతరం నీరు సరఫరా చేయాలన్నారు.


