సాక్షి, బళ్లారి: నగర కార్పొరేషన్ పరిధిలో ఏఈఈ వీరేష్‌పై కార్పొరేటర్ కుబేర విచక్షణ రహితంగా దాడి చేశారు. శుక్రవారం నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి ఆధ్వర్యంలో 38వ వార్డులో సలాం బళ్లారి కార్యక్రమం జరిగింది. వార్డులో తిరుగుతున్న సమయంలో ఇంజినీర్ వీరేష్, కార్పొరేటర్ కుబేరకు మాటల యుద్ధం జరిగింది. ఫుట్‌పాత్‌కు సంబంధించిన అంశంపై మాట్లాడుతుండగా ఇంజినీర్ వీరేష్‌పై కార్పొరేటర్ కుబేర దాడి చేశారు. వెంటనే అక్కడే ఉన్న ఎమ్మెల్యే అనుచరులు, పలువురు వీరేష్‌ను హుటాహుటిన స్థానిక జిల్లాస్పత్రికి చేర్పించారు. జిల్లా ఆస్పత్రి ఇన్‌చార్జ్ డాక్టర్ బసారెడ్డి, సిటీ కమిషనర్ మంజునాథ్, మాజీ మేయర్, కార్పొరేటర్ ఇబ్రహీంబాబు, పలువురు కార్పొరేటర్లు, సిబ్బంది తదితరులు వీరేష్‌ను పరామర్శించారు. అనంతరం బ్రూస్‌పేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆస్పత్రికి చేరుకుని వీరేష్ నుంచి వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకున్నారు.
దాడి చేయడం సరికాదు..
నగర కార్పొరేషన్ పరిధిలో ఇంజినీర్ వీరేష్‌పై కార్పొరేటర్ కుబేర దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కమిషనర్ మంజునాథ్ తెలిపారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేసే అధికారం ఎవరు ఇచ్చారని కార్పొరేషన్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గోవిందబాబు ధ్వజమెత్తారు. దాడి చేసిన కార్పొరేటర్ కుబేరను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు ఆందోళన చేస్తామన్నారు.
చర్యలు తీసుకుంటాం..
నిరసన చేపట్టిన కార్పొరేషన్ సిబ్బందితో ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి మాట్లాడారు. ఇంజినీర్‌పై దాడిని తాము కూడా ఖండిస్తున్నట్లు తెలిపారు. కార్పొరేటర్ కుబేర్‌ను అరెస్ట్ చేస్తామని హామీ ఇచ్చారు. కుబేర్‌ను అరెస్ట్ చేసే దాకా ధర్నా కొనసాగిస్తామని సిబ్బంది తేల్చి చెప్పారు.
కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా
ఇంజినీర్ వీరేష్‌పై 38వ వార్డు కార్పొరేటర్ కుబేర దాడి చేయడాన్ని ఖండిస్తూ బీజేపీ నాయకులు, కార్పొరేషన్ సిబ్బంది శుక్రవారం సాయంత్రం ఆందోళన చేపట్టారు. బీజేపీ పాలికె ప్రతిపక్ష నాయకుడు మోత్కూరు శ్రీనివాసరెడ్డి, పాలికె మాజీ మేయర్, కార్పొరేటర్ ఇబ్రహీం బాబు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులకు భద్రత లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. నిజాయతీగా పనిచేసే సిబ్బందిపై పాలకులు దాడి చేస్తే ఇక అభివృద్ధి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. నిరసనలో విధానపరిషత్ సభ్యుడు వై.ఎం.సతీష్ పాల్గొని మద్దతు ఇచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు గోవిందరాజులు, మాజీ మేయర్, నగర బీజేపీ అధ్యక్షుడు గుర్రం వెంకటరమణ పాల్గొన్నారు.


