సాక్షి, బళ్లారి: అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో గ్యాస్ సమస్య అన్ని ప్రాంతాల్లో ఉంది. బ్లాక్ మార్కెట్‌లో గ్యాస్ విక్రయించి వినియోగదారులకు ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదని ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం నగరంలోని దేవినగర్ ప్రాంతంలో సలాం బళ్లారి, గడప గడపకూ భరత్ కార్యక్రమంలో భాగంగా ఆయన పలు వార్డుల్లో పర్యటించారు. స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆటోలకు ఎల్‌పీజీ గ్యాస్ సమస్య లేకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. మంచినీటి సమస్య అధిగమించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత నగరంలో శాశ్వతంగా మంచినీటి సమస్య పరిష్కరించేందుకు చొరవ తీసుకున్నట్లు వెల్లడించారు. ఏప్రిల్ 1 నుంచి 15వ తేదీ వరకు జరగనున్న జనగణనకు నగర ప్రజలు సహకారం అందించాలని సూచించారు. అనంతరం సొంత నిధులతో కిచెన్ కిట్లు పంపిణీ చేశారు.


