గందరగోళంగా పాలికె సామాన్య సమావేశం | - | Sakshi
Sakshi News home page

గందరగోళంగా పాలికె సామాన్య సమావేశం

Apr 3 2026 7:38 AM | Updated on Apr 3 2026 7:38 AM

సాక్షి,బళ్లారి: మహానగర పాలికె సమాన్య సమావేశం గందరగోళంగా మారింది. గురువారం మేయర్‌ గాదెప్ప అధ్యక్షతన పాలికె సామాన్య సమావేశం నిర్వహించగా అధికార పార్టీ కార్పొరేటర్లు పలువురు గైర్హాజరయ్యారు. పాలికె పరిధిలో 39 మంది కార్పొరేటర్లు ఉండగా, వారిలో సగం మంది కూడా హాజరు కాలేదు. అధికార కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కార్పొరేటర్లు పలువురు మేయర్‌పై అసంతృప్తిగా ఉన్నారనే ఆరోపణలతో పలువురు కార్పొరేటర్లు సమావేశానికి డుమ్మా కొట్టారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సమావేశం జరపాలంటే కోరం కావాల్సి ఉండగా, తగినంత మంది కార్పొరేటర్లు సమావేశానికి రాకపోవడంతో ఫోన్లు చేసి మరీ పలువురిని పిలిపించుకున్నారు. 11 గంటలకు నిర్వహించాల్సిన సమావేశాన్ని చివరకు ఒకటిన్నర గంట పాటు ఆలస్యంగా ప్రారంభించారు. మేయర్‌తో పాటు పాలికె కమిషనర్‌ మంజునాథ్‌, పలువురు అధికారులు వేదికపై కూర్చొన్నా సభ్యులు తగినంత మంది నిర్ణీత గడువులోగా హాజరు కాలేదు. ప్రతిపక్ష బీజేపీ కార్పొరేటర్లు 8 మంది హాజరుకాగా చివరకు అధికార కాంగ్రెస్‌ పార్టీ నుంచి 9 మంది కోరంకు సరిపడే విధంగా సమావేశానికి హాజరయ్యారు.

సమస్యలపై గళం విప్పిన పాలికె కార్పొరేటర్లు

సభ వాయిదా పడుతుందేమోనని భావించిన తరుణంలో ఎట్టకేలకు పాలికె సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి హాజరైన పాలికె కార్పొరేటర్లు నగర సమస్యలపై తీవ్రంగా ప్రశ్నించారు. పాలికె ప్రతిపక్ష నాయకుడు మోత్కర్‌ శ్రీనివాస్‌, మాజీ మేయర్‌, కార్పొరేటర్‌ ఇబ్రహీంబాబు మాట్లాడుతూ నగరంలో అభివృద్ధి పనులు పూర్తిగా స్తంభించిపోయాయన్నారు. నగరంలో మంచినీటి సమస్య తీవ్రమైందని అన్నారు. కమిషనర్‌ మంజునాథ్‌ స్పందిస్తూ వేసవిలో తరుచూ మంచినీరు ఇవ్వడం సాధ్యం కాదని, అయితే నగరంలో నీటి సమస్య తలెత్తకుండా జాగ్రత్తగా నీరు వదులుతున్నామన్నారు. మంచినీటి సమస్యపై అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని పాలికె కార్పొరేటర్లు మించు శ్రీనివాస్‌, గుడిగంటి హనుమంతప్ప కోరారు. ఓ వైపు ఎండవేడిమి, మరోవైపు మంచినీటి సమస్యతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ తమ వార్డుల్లో జనం తమను మంచినీటి కోసం నిలదీస్తున్నారని, నీరు ఉన్నా ఎందుకు సక్రమంగా సరఫరా చేయడం లేదని మండిపడ్డారు. కార్పొరేటర్లు గోవిందరాజులు, కే.ఎస్‌.అశోక్‌, కుబేర, కవితా వన్నప్ప, కే.హనుమంతప్ప తదితరులు పాల్గొన్నారు.

పలువురు అధికార పార్టీ కార్పొరేటర్ల గైర్హాజర్‌

కోరం లేకపోవడంతో ఫోన్లు చేసి మరీ పిలిచి సమావేశం నిర్వహణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement