సాక్షి,బళ్లారి/రాయచూరు రూరల్: శాస్త్ర శాంతికేతిక రంగం అభివృద్ధి చెందుతూ యువతకు కొత్త అవకాశాలు తీసుకు వస్తున్నా, అదే సమయంలో అదే సాంకేతికతతో ప్రమాదం బారిన పడే పరిస్థితులను కూడా సృష్టిస్తోంది. అతను చదువు అన్నింటిలో ఫస్ట్ వచ్చేవాడు. 10వ తరగతి, పీయూసీ, అనంతరం ఎంబీబీఎస్ సీటు కూడా మంచి ర్యాంకుతో బీదర్ మెడికల్ కళాశాలలో సాధించాడు. నాలుగేళ్ల ఎంబీబీఎస్ పూర్తి చేసి, మరో ఏడాదిలో వైద్య విద్యార్థి నుంచి వైద్యుడుగా మారి ఉద్యోగం కూడా తెచ్చుకునే సమయం దగ్గరకు వస్తున్న శుభ తరుణంలో ఆ మంచి వైద్య విద్యార్థి స్నేహితుల మాయలో పడి ఆన్‌లైన్ గేమ్‌కు బానిస అయ్యాడు. గత కొన్ని నెలలుగా ఆన్‌లైన్ గేమ్‌తో పాటు నిత్యం సెల్‌మాయలో కూడా పడిపోవడంతో మానసిక ఒత్తిడికి లోనయ్యాడు.
గేమ్‌లో రూ.80 వేలు పోగొట్టుకున్న వైనం
ఆన్‌లైన్ గేమ్‌లో రూ.80 వేల వరకు డబ్బులు కూడా పోగొట్టుకోవడంతో వైద్య విద్యార్థి చివరికి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. కలబుర్గి జిల్లా చించోళి తాలూకా సలగర్ తాండాకు చెందిన అనిష్కార్ చౌహాన్(21) అనే విద్యార్థి బీదర్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. ఆన్‌లైన్ గేమ్‌లో డబ్బులు పోగొట్టుకోవడంతో వసతి నిలయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో తోటి విద్యార్థులు పోలీసులకు సమాచారం అందించారు. జిల్లా ఎస్పీ ప్రదీప్‌తో పాటు డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. వసతి నిలయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న దృశ్యాన్ని గమనించి, మృతదేహాన్ని కిందకు దింపి పరిశీలించిన అనంతరం పోస్టుమార్టం నిమిత్తం అక్కడి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
శోకసంద్రంగా ఆస్పత్రి ప్రాంగణం
తల్లిదండ్రులకు విషయం తెలియగానే బీదర్‌లోని ఆస్పత్రి వద్దకు చేరుకుని తమ కుమారుడు విగతజీవిగా పడి ఉన్న దృశ్యాన్ని చూసి భోరున విలపించారు. తమ బిడ్డ బాగా చదువుకునేవాడని, ఎలాంటి చెడు అలవాట్లు కూడా లేవని, మరో ఏడాదిలో వైద్య విద్యా కోర్సు ముగుస్తుందని, మంచి ఉద్యోగం వస్తుందని చెప్పేవాడని, అంతలోనే ఇలా తన జీవితాన్ని చాలించాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వారి రోదనలను ఆపడం ఎవరి తరం కాలేదు. విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు, తోటి వైద్య విద్యార్థులు అందరూ కంటతడి పెట్టారు. మంచి భవిష్యత్తు ఉన్న యువకుడు ఆన్‌లైన్ మాయా ప్రపంచపు వలలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలిచివేసింది. ఈ ఘటనపై బీదర్ న్యూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
బీదర్ వసతి నిలయంలో వైద్య విద్యార్థి బలి
మరో ఏడాదిలో ముగియనున్న ఎంబీబీఎస్ విద్యాభ్యాసం
ఓటమి, నిరాశ, మానసిక ఒత్తిడితో బలవన్మరణం చేసుకున్న వైనం


