సాక్షి,బళ్లారి: తమ పొలంలో ఓ ఎస్సీ యువకుడు నీళ్లు తాగాడనే చిన్న కారణానికి రెండు కులాల మధ్య వాగ్వాదం చెలరేగి తీవ్ర ఘర్షణకు దారి తీసింది. దీంతో 24 మందికి తీవ్ర గాయాలు కాగా ఇరు వర్గాల వారు ఆస్పత్రి పాలైన ఘటన గదగ్ జిల్లా ముండరిగి తాలూకా చిక్కవద్దట్టి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు.. ఎస్టీ సముదాయానికి చెందిన రైతు పొలంలో ఎస్సీ సముదాయానికి చెందిన ఓ యువకుడు నీళ్లు తాగడానికి వెళ్లాడు. దీంతో రెండు కులాలకు చెందిన యువకులు తాగునీటి విషయమై గొడవ పడ్డారు. అది చినికి చినికి గాలి వానగా మారి రెండు కులాల మధ్య రగడ పతాక స్థాయికి చేరింది. పొలంలో చోటు చేసుకున్న ఘర్షణతో గ్రామంలోని ఎస్సీ, ఎస్టీ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరగడంతో రెండు కులాలకు చెందిన వారు దాదాపు 24 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయం పోలీసు స్టేషన్‌కు చేరింది. ఘటన స్థలానికి చేరుకున్న అక్కడి పోలీసు అధికారులు, సిబ్బంది రెండు వర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారిని అక్కడి ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ఈ ఘటన గదగ్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. పొలంలో మంచినీరు తాగడానికి వెళ్లిన వ్యక్తిపై రగడకు దిగడమేంటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గదగ్ జిల్లాలో కుల ఘర్షణ
ఎస్సీ, ఎస్టీ వర్గాల మధ్య ఘర్షణ
24 మందికి తీవ్ర గాయాలు


