హుబ్లీ: ధార్వాడ జిల్లాలోని రామపుర గ్రామ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో బెళగావి జిల్లా బైలహొంగల మాజీ ఎమ్మెల్యే కుమారుడు తన సొంత కారులోనే పూర్తిగా కాలిపోయిన స్థితిలో శవంగా లభించారు. ఇది పథకం ప్రకారం చేసిన హత్యగా అనుమానిస్తున్నారు. మొత్తానికి ఈ ఘటన ఇటు ధార్వాడ, అటు బెళగావి జిల్లాల్లో సంచలనం సృష్టించింది. బైలహొంగల మాజీ ఎమ్మెల్యే బాబూరావ్ బొళశెట్టి కుమారుడు రాజు బొళశెట్టి(53) మృతుడు. ధార్వాడ తాలూకా రామపుర గ్రామం వద్ద రైల్వే ట్రాక్ పక్కన దట్టమైన అరణ్యంలో ఆయన సొంత వ్యాగనార్ కారులో కాలిపోయిన స్థితిలో ఆయన శవం లభ్యమైంది. దుండగులు రాజును ముందుగా హత్య చేశాక సాక్ష్యాలు నాశనం చేయాలన్న ఉద్దేశంతో నిర్మానుష్య ప్రాంతానికి తెచ్చి ఆయన సొంత కారులోనే నిప్పుపెట్టి కాల్చినట్లుగా అనుమానిస్తున్నారు. ఆయన దేహంతో పాటు కారు కూడా పూర్తిగా కాలిపోయిన స్థితిలోనే కనిపించింది. కాగా ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ గుంజన్ ఆర్య పరిశీలించారు. విధి విజ్ఞాన, డాగ్ స్క్వాడ్ ఘటన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సాక్ష్యాలను సేకరించారు. ధార్వాడ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని వివిధ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. కాగా రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబానికి చెందిన వ్యక్తిపై జరిగిన ఈ నిగూఢ హత్య ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తోంది.
కాలిపోయిన స్థితిలో కారుతో పాటు
మృతదేహం లభ్యం
పథకం ప్రకారం చేసిన హత్యగా
అనుమానాలు


