రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటక ప్రాంత అభివృద్ధి మండలి(కేకేఆర్‌డీబీ)లో రూ.కోట్లలో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలని హైదరాబాద్ కర్ణాటక జనాందోళన సమితి అధ్యక్షుడు రాఘవేంద్ర కుష్టిగి డిమాండ్ చేశారు. మంగళవారం పాత్రికేయుల భనవంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 12 ఏళ్ల క్రితం జారీ చేసిన రాజ్యాంగంలోని ఆర్టికల్–371(జె) అమలు విషయంలో నిర్లక్ష్యం వహించారన్నారు. 2025–26లో రూ.5 వేల కోట్ల నిధులున్నా దానికి సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించకుండా కాలయాపన చేశారని దుయ్యబట్టారు. కేవలం రూ.862.93 కోట్ల పనులకు అనుమతి పొంది మిగిలిన రూ.4,137 కోట్ల నిధులకు ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదని, నైతిక బాధ్యతగా కేకేఆర్‌డీబీ అధ్యక్షుడు అజయ్‌సింగ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నాసిరకంగా చేపట్టిన పనులపై థర్డ్ పార్టీ తనిఖీ చేయకుండా నిధులు గోల్‌మాల్ చేశారని, దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని ఒత్తిడి చేశారు. బసవరాజ్, భీమ రాయ, జాన్‌వెస్లీ, ఖాజా అస్లాం పాషాలున్నారు.


