బనశంకరి: బెంగళూరులో ఇకనుంచి రోడ్ల పక్కన బైక్‌లు, కార్లు వంటి సొంత వాహనాలను నిలిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నిబంధనలను మీరితే పోలీసులు వాటిని టోయింగ్ వాహనాలకు బిగించి తీసుకెళ్తారు. బుధవారం నుంచి నగరంలో నో పార్కింగ్ ఏరియాలలో వాహనాలను పార్కింగ్ చేస్తే జరిమానా తప్పదు. టోయింగ్ వ్యవస్థ మళ్లీ అమల్లోకి వస్తోంది. జీబీఏ, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా నగర రోడ్లలో నో పార్కింగ్ ప్రదేశాల్లో నిలిపే వాహనాలను టోయింగ్ చేసి జరిమానా విధిస్తారు. దీంతో పాటు టోయింగ్ చేసే సమయంలో వాహనదారులు, పోలీసుల మధ్య గొడవలు జరిగే బెడద ఉంది. ఇకపై టోయింగ్ వాహనాల్లో కెమెరాలను అమరుస్తారు. దీనివల్ల వాహనాల తరలింపులో వాహనాలు దెబ్బతినడం, లేదా వివాదాలు జరగడం వంటివి రికార్డు అవుతాయి. పారదర్శకత ఉంటుందని అధికారులు చెప్పారు. టోయింగ్ ఫీజు రూ.1000 , నో పార్కింగ్ జరిమానా రూ వెయ్యి కలిపి రూ.2 వేలు జరిమానా చెల్లించాలి.
గతంలో రద్దయి...
గతంలో టోయింగ్ గురించి ప్రజల నుంచి పోలీసులపై ఆరోపణలు వెల్లువెత్తాయి. వాహనాలు దెబ్బతినడం, అనవసరంగా జరిమానా విధించి తరలించడం చేస్తున్నారని జనం దుయ్యబట్టారు. దీంతో ప్రభుత్వం టోయింగ్‌ను నిలిపివేసింది.
నేటి నుంచి టోయింగ్ ప్రక్రియ షురూ


