శివాజీనగర: అత్యధిక బడ్జెట్‌సార్లు బడ్జెట్‌ను సమర్పించి రికార్డు సృష్టించిన ముఖ్యమంత్రి సిద్దరామయ్య అత్యధిక అప్పులు చేసిన సీఎం కూడా అయ్యారు అని బీజేపీ ఎమ్మెల్యే సునీల్‌కుమార్ విధానసభలో ఆరోపించారు. రెండురోజుల విరామం తరువాత సోమవారం అసెంబ్లీ సమావేశాలు ఆరంభమయ్యాయి. ఆర్థిక పరిస్థితి మీద ప్రతిపక్షాలు ప్రశ్నల వర్షం కురిపించాయి. బడ్జెట్‌పై చర్చలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే సునీల్, సిద్దరామయ్య ప్రభుత్వం వచ్చాక రూ. 1.32 లక్షల కోట్ల అప్పులు చేసింది. ఇదో రికార్డు, అంతే కాకుండా అధిక సమస్యలను సృష్టించిన సీఎం కూడా ఆయనే అని ఆరోపించారు. బడ్జెట్‌లో 56 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. అయితే అందుకు నిఽధులను కేటాయించలేదు, దీనిని బట్టి ఉద్యోగాల భర్తీ అనేది అబద్ధమన్నారు. ధర్నాలు చేసిన నిరుద్యోగ యువతను బుజ్జగించేందుకు ఉద్యోగాల భర్తీ అన్నారు, నిధులు లేకుండా ఎలా సాధ్యమని విమర్శించారు.
కులగణన ఏమైంది?
వీబీజీ రామ్ జీని వ్యతిరేకిస్తున్న సిద్దరామయ్య నరేగా కింద పెండింగ్‌లో ఉన్న 5 లక్షల పనులకు నిధులు ఇవ్వలేదని సునీల్ ఆరోపించారు. గృహలక్ష్మీ పథకం పెండింగ్ కంతుల గురించి ఊసే లేదన్నారు. సిద్దరామయ్య బడ్జెట్‌లో కొత్త కొత్త శబ్దాలను వినియోగించారు, వచ్చే బడ్జెట్‌లో శబ్ధకోశం అవసరముంది. సభాపతి శబ్ధకోశాన్ని పంపిణీ చేయాలి అని వ్యాఖ్యానించారు. సీఎం హడావుడిగా కులగణన జరిపించారు, ఇది ముగిసి 7 నెలలు గడచినా కూడా ఆ నివేదిక ఏమైందనేది తెలియదని ఆయన మండిపడ్డారు. కులగణనకు రూ.500 కోట్లు ఖర్చు చేశారన్నారు. బడ్జెట్లో కులగణన గురించి ప్రస్తావనే లేదన్నారు. వెనుకబడిన 177 తాలూకాలకు ప్రత్యేక నిధులను కేటాయించలేదన్నారు. ఎస్సీ ఎస్టీల అంతర్గత రిజర్వేషన్ల వివాదాన్ని ఇంతవరకూ పరిష్కారం చేయలేదన్నారు.
ఖాతాల్లో అవినీతి
మాకు కేంద్ర ప్రభుత్వ నూతన విద్యా విధానం వద్దు, రాష్ట్ర విద్యా విధానాన్ని అమలుపరుస్తామని చెప్పారు, బడ్జెట్‌లో ఆ విధానం ఏమిటో ప్రకటించలేదన్నారు. రెవెన్యూ శాఖలో కంప్యూటర్ సర్వర్‌ల సమస్య నెలకొంది, పల్లెలే కాదు, బెంగళూరులో ఖాతా సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆరోపించారు. ఈ ఖాతాల్లో అవినీతి రాజ్యమేలుతోందన్నారు. టాక్సీ డ్రైవర్లు ప్యానిక్ బటన్ అమర్చుకోవాలన్నారు, వాటి ధర చాలా ఎక్కువ, పేద డ్రైవర్లు ఎలా భరిస్తారని ఆయన ప్రశ్నించారు. సిద్దరామయ్య ఖరీదైన శాలువా వేసుకొని తిరుగుతూ రాష్ట్ర ప్రజలపై అప్పులు మోపుతున్నారని దుయ్యబట్టారు.
కేంద్రం నుంచి రూ.19వేల కోట్లు రావాలి
దొడ్డబళ్లాపురం: జలజీవన్ మిషన్ కింద కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.19,101 కోట్లు నిధులు రావాల్సి ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎస్‌ఎన్ నారాయణస్వామి అసెంబ్లీలో తెలిపారు. కేంద్రం ఇప్పటి వరకూ రూ.11,770 కోట్లు విడుదల చేసిందన్నారు. రూ.12 వేల కోట్లతో బెంగళూరులో మెట్రో రైలు మార్గాన్ని 96 కిలోమీటర్లు పెంచుతున్నామన్నారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల్లో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను తగ్గించారని, దీంతో రాష్ట్రానికి రూ.15 వేల కోట్ల నష్టం కలిగిందన్నారు. దీనిపై బీజేపీ ఎమ్మెల్యేలు,ఎంపీలు మాట్లాడక పోవడం బాధాకరమన్నారు.
సర్కారీ ఆస్పత్రుల్లో మందుల్లేవు
దొడ్డబళ్లాపురం: ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు మందుల సమస్య లేకుండా చేసేందుకు జూన్ నెలలోనే మందుల కొనుగోలుకు టెండర్లు పిలుస్తామని ఆరోగ్యశాఖ మంత్రి దినేశ్ గుండూరావ్ తెలిపారు. విధాన పరిషత్‌లో జిల్లాస్పత్రుల్లో మందుల కొరత తీవ్రంగా ఉందని కొందరు సభ్యులు తెలిపారు. కళ్యాణ కర్ణాటక ప్రాంతాల్లో జ్వరం, న్యుమోనియా, కుక్కకాటు మందులు దొరకడం లేదన్నారు. జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇందుకు మంత్రి పై సమాధానం ఇచ్చారు. ఆస్పత్రులకు 234 రకాల మందులను సరఫరా చేస్తున్నామన్నారు.
సమస్యల ఊసులేని బడ్జెట్
విధానసభలో బీజేపీ ధ్వజం
దొడ్డబళ్లాపురం: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాలపై కక్ష సాధింపులకు పాల్పడుతోందని, 2028లో తన బలం ఏంటో కాంగ్రెస్‌కి తెలుస్తుందని మాజీ మంత్రి, జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణ అన్నారు. సోమవారంనాడు అసెంబ్లీలో మాట్లాడిన ఆయన తనను సంబంధం లేని కేసుల్లో ఇరికించారని మండిపడ్డారు. హోంమంత్రి పరమేశ్వర్ అంటే తనకు ఎంతో గౌరవం ఉందన్నారు. హాసన్ జిల్లాలో ప్రతిపక్షాల నేతలను,కార్యకర్తలను వేధిస్తున్నారన్నారు. తనపై ఇంకా 10 కేసులు పెట్టినా భయపడేది లేదని, తనను అణచివేయడం ఎవరివల్లా కాదన్నారు. హాసన్ జిల్లాలో రెవెన్యూ శాఖలో సుమారు రూ.3 వేల కోట్ల మేరకు అవినీతి జరిగిందని, తమ జిల్లాలో భూకబ్జాలు మితిమీరిపోయాయన్నారు. అధికారులు రియల్ ఎస్టేట్ మాఫియాతో కుమ్మక్కయ్యారన్నారు.


