సాక్షి, బళ్లారి: రాష్ట్రంలో వచ్చే నెల 9న జరగనున్న దావణగెరె, బాగల్‌కోటె అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు ఖాయమని సీఎం సిద్ధరామయ్య అన్నారు. ఆయన సోమవారం దావణగెరెలో కాంగ్రెస్ అభ్యర్థి శ్యామనూరు సమర్థ్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని విలేకరులతో మాట్లాడారు. దావణగెరె దక్షిణ నియోజకవర్గం నుంచి మైనా ర్టీలు టికెట్ ఆశించిన మాట వాస్తవమేనన్నారు. అయితే పార్టీ అన్ని కోణాల్లో ఆలోచించి, సీనియర్ నాయకుడు శ్యామనూరు శివశంకరప్ప మృతితో ఖాళీ అయిన స్థానం నుంచి ఆయన కుటుంబానికి టికెట్ ఇచ్చిందన్నారు. మైనార్టీలు వేరే పార్టీకి మద్దతు ఇవ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. నూటికి నూరు శాతం కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు ఖాయం అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలవడానికి ఎలాంటి అవకాశాలు లేవని, కాబట్టి ఫలితాలు దిక్సూచి కాదని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
బీజేపీ విజయం తథ్యం: యడ్డి
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిచడంతో పాటు అభివృద్ధి పూర్తిగా లేకుండా పోయిందని బీజేపీ నేత, మాజీ సీఎం యడియూరప్ప విమర్శించారు. ఆయన దావణగెరెలో బీజేపీ అభ్యర్థి శ్రీనివాస దాసకరియప్ప నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. దావణగెరెతో పాటు బాగల్‌కోటలో కూడా బీజేపీ అభ్యర్థి గెలవడం ఖాయమన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి నిలిచిపోయిందని, ప్రజలకు సౌకర్యాలలో ఘోరంగా విఫలమయ్యారన్నారు. ఈ ఉప ఎన్నికలతో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ గెలిచి అధికారంలోకి వస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుతున్నారన్నారు. ఈ సందర్భంగా ఇరు పార్టీల అభ్యర్థుల ర్యాలీలు జనసాగరాన్ని తలపించాయి. రెండు నగరాల్లోనూ కోలాహలం నెలకొంది.
దావణగెరె, బాగల్‌కోటెలో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల నామినేషన్ ర్యాలీలు
తమదే గెలుపన్న సీఎం సిద్దు


