అట్టహాసంగా నామినేషన్లు | - | Sakshi
Sakshi News home page

అట్టహాసంగా నామినేషన్లు

Mar 24 2026 7:06 AM | Updated on Mar 24 2026 7:06 AM

సాక్షి,బళ్లారి: రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగే రెండు నియోజకవర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులు అట్టహాసంగా నామినేషన్లు దాఖలు చేశారు. దావణగెరె దక్షిణ, బాగల్‌కోటె రెండు నియోజకర్గాలకు ఉప ఎన్నిక వచ్చే నెల 9న జరగనున్న నేపథ్యంలో సోమవారం నామినేషన్లు సమర్పించేందుకు ఆఖరి రోజు కావడంతో దావణగెరె కాంగ్రెస్‌ అభ్యర్థి శ్యామనూరు సమర్థ్‌, బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్‌ టీ.దాస్‌కరియప్ప అట్టహాసంగా నామినేషన్లు సమర్పించారు. ఇది వరకే వీరిద్దరూ గత శుక్రవారం మంచి రోజు కావడంతో ఒక సెట్టు సమర్పించిన సంగతి తెలిసిందే. దావణగెరె దక్షిణ నియోజకవర్గానికి మైనార్టీ అభ్యర్థి తీవ్రంగా పోటీ పడిన నేపథ్యంలో ఒక రోజు ముందుగా అభ్యర్థి పేరును ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో టికెట్‌ను నామినేషన్ల సమర్పణకు చివరి రోజున కాంగ్రెస్‌ అభ్యర్థి శ్యామనూరు సమర్థ్‌ భారీ జన సందోహం మధ్య ర్యాలీగా తరలిరావడంతో పాటు ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లతో పాటు పలువురు మంత్రులు హాజరై జిల్లాధికారి కార్యాలయంలో నామినేషన్లు సమర్పించారు.

బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్‌ కూడా..

దావణగెరె దక్షిణ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్‌ టీ.దాస్‌ కరియప్ప కూడా భారీ జన సందోహంతో తరలివచ్చి నామినేషన్లు సమర్పించారు. బీజేపీ అభ్యర్థికి మద్దతుగా మాజీ సీఎం యడియూరప్ప, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర, మాజీ కేంద్ర మంత్రులు తరలి రావడంతో బీజేపీ అభ్యర్థి కూడా ఉత్సాహంగా నామినేషన్లు దాఖలు చేశారు. రెండు పార్టీల అభ్యర్థులు ఒకే రోజు నామినేషన్లు సమర్పించిన నేపథ్యంలో దావణగెరె నగరంలో ఎటు చూసినా భారీ జనసందోహంతో వీధులన్నీ నిండిపోగా బీజేపీ, కాంగ్రెస్‌ జెండాలు, బ్యానర్లు రెపరెపలాడాయి.

కాంగ్రెస్‌ రెబల్‌గా సాధిక్‌ ఫైల్వాన్‌

రెండు పార్టీల్లో అసమ్మతి బెడద కనిపించడంతో కాంగ్రెస్‌ టికెట్‌ కోసం తీవ్రంగా ప్రయత్నించిన మైనార్టీ నేత సాధిక్‌ పైల్వాన్‌ కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థిగా నామినేషన్లు వేశారు. సాధిక్‌ పైల్వాన్‌కు టికెట్‌ ఇవ్వాలని మంత్రి జమీర్‌ అహమ్మద్‌ కూడా తీవ్రంగా పట్టుబట్టారు. అయితే శ్యామనూరు కుటుంబానికే టికెట్‌ కేటాయించగా మంత్రి జమీర్‌ అహమ్మద్‌ కూడా కాంగ్రెస్‌ అభ్యర్థికి మద్దతుగా నామినేషన్లు వేసే కార్యక్రమంలో పాల్గొనకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మైనార్టీలకు కాంగ్రెస్‌ టికెట్‌ కేటాయించలేదనే ఆగ్రహంతో దావణగెరెలో 12వ వార్డుకు చెందిన పలువురు ముస్లిం సమాజానికి చెందిన యువకులు పెద్ద సంఖ్యలో బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్‌ టీ.దాస్‌కరియప్ప సమక్షంలో బీజేపీలో చేరారు.

ఉమేష్‌ మేటి నామినేషన్‌

బాగల్‌కోటె నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరపున పోటీ చేస్తున్న ఉమేష్‌ మేటి అట్టహాసంగా నామినేషన్లు దాఖలు చేశారు. ఆ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఆర్‌.బీ.తిమ్మాపుర, డీసీసీ అధ్యక్షుడు ఎస్‌.జీ.నంజయ్యతో పాటు పలువురు కాంగ్రెస్‌ ప్రముఖులు హాజరు కావడంతో పాటు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్‌ అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో బాగల్‌కోటెలోని వీధులు ఎటు చూసినా కాంగ్రెస్‌ జెండాలు, మద్దతుదారులతో కిటకిటలాడాయి.

నామినేషన్‌ సమర్పిస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి సమర్థ్‌, చిత్రంలో సీఎం, డీసీఎం

నామినేషన్‌ వేస్తున్న బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్‌, చిత్రంలో మాజీ సీఎం యడ్డి

ముగిసిన ఆయా పార్టీ అభ్యర్థుల నామినేషన్ల ఘట్టం

కాంగ్రెస్‌ అభ్యర్థులకు మద్దతుగా హాజరైన సీఎం, డీసీఎం

బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా మాజీ సీఎం, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు

భారీ ర్యాలీలతో అభ్యర్థుల శక్తి ప్రదర్శన, ప్రధాన పార్టీలకు వీడని అసమ్మతి

దావణగెరెలో కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థిగా సాధిక్‌ ఫైల్వాన్‌ నామినేషన్‌ దాఖలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement