● పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో ఆగిన ఎగుమతులు
● పడిపోయిన డిమాండ్
● లబోదిబోమంటున్న రైతులు
హొసపేటె: ఏ రుచికరమైన వంట చేయాలన్నా కొబ్బరి వాడకం తప్పనిసరి. ఇక పూజల్లో టెంకాయలను విరివిరిగా వాడుతుంటాం. అలాంటి కొబ్బరి కాయల ధరలు అకస్మాత్తుగా పడిపోయాయి. దీనికి కారణం పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రధానం కారణం అని చెప్పుకోవచ్చు. యుద్ధం ప్రభావం సామాన్య రైతులపై కూడా పడింది. కొబ్బరి కాయలను మన దేశం నుంచి గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేసేవారు. యుద్ధం నేపథ్యంలో ప్రస్తుతం ఎగుమతులు ఆగిపోవడంతో కొబ్బరి కాయల ధరలు తగ్గుముఖం పట్టాయి. ఎగుమతి కావాల్సిన కొబ్బరి అంతా స్థానిక మార్కెట్లకు చేరుతోంది. దీనివల్ల మార్కెట్‌లో సరుకు ఎక్కువై డిమాండ్ పడిపోయింది. ఉత్తర కర్ణాటకలో గత రెండు వారాలుగా ధరలు పడిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి క్వింటాల్‌కు రూ.2,000 మేర ధర తగ్గింది. క్వింటాల్‌కు రూ.7,000 నుంచి రూ.4,500లకు పడిపోయింది. కొబ్బరి కాయ సైజ్‌ను బట్టి రూ.30 నుంచి రూ.20 వరకూ విక్రయిస్తున్నారు. గత ఏడాది తమ వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధరలు పొందుతున్న రైతులు, ప్రస్తుత మార్కెట్ పరిణామాలతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో కోతుల బెడదతో కొబ్బరి పంట ఇప్పటికే తీవ్రంగా దెబ్బతింటోంది.
ఎంత తగ్గుదల?
విజయనగర జిల్లాలో హొసపేట, అగిరి బొమ్మనహళ్లి, కూడ్లిగి, అడగళి, కొట్టూరులో కొబ్బరి మార్కెట్లు ఉన్నాయి. గత సంవత్సరం జనవరిలో, లేత కొబ్బరి మార్కెట్‌లో క్వింటాల్ కొబ్బరి ధర సుమారు రూ.5,500 నుంచి రూ.6,000 మధ్య ఉండేది. అది క్రమంగా పెరిగి, కొన్ని నెలల పాటు ధర రూ.7 వేలు కూడా దాటింది. ఆ తర్వాత అది కొద్దిగా తగ్గి, సుమారు రూ.6,500 నుంచి రూ.7,000 చేరుకుంది. ఎగుమతులు లేకపోవడం, దిగుబడుల్లో హెచ్చుతగ్గులు, పండుగల నేపథ్యంలో ధరల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం సగటు ధర క్వింటాల్‌కు రూ.5,000 కంటే తక్కువకు పడిపోయింది. కనిష్ట ధర రూ.4,500గా నమోదైంది. కొబ్బరి ఉత్పత్తుల ఎగుమతికి అంతరాయం కలగడంతో కొనుగోలుదారులు వెనుకాడుతున్నారని రైతులు చెబుతున్నారు.


