టీబీ డ్యాంలో పూడికతీతపై పట్టించుకోరా? | - | Sakshi
Sakshi News home page

టీబీ డ్యాంలో పూడికతీతపై పట్టించుకోరా?

Mar 23 2026 8:52 AM | Updated on Mar 23 2026 8:52 AM

సాక్షి, బళ్లారి: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల పరిధిలోని బళ్లారి, రాయచూరు, కొప్పళ, విజయనగర, అనంతపురం, కర్నూలు, వైఎస్సార్‌ కడప జిల్లా, మహబూబ్‌ నగర్‌ జిల్లాలకు తాగు, సాగు నీరందించే ఉమ్మడి ప్రధాన జలాశమైన తుంగభద్ర డ్యాంలో పూడికతీతపై మూడు రాష్ట్రాలకు చెందిన పాలకులు పట్టించుకోవడం లేదు. సవతి తల్లి ధోరణి అవలంభిస్తున్నారని తుంగభద్ర ఆయకట్టు రైతు సంఘం అధ్యక్షుడు దరూరు పురుషోత్తం గౌడ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం నగరంలోని పత్రికా భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తుంగభద్ర డ్యాం నుంచి ఏటా దాదాపు 300 టీఎంసీలకు పైగా నీరు వృథాగా కిందకు పోతోందన్నారు. శ్రీశైలం డ్యాంలోకి వెళ్లి అక్కడ నుంచి సముద్రంలోని నీరు చేరుతోందని తెలిపారు. వృథాగా వెళ్తున్న నీటిని నిల్వ చేసేందుకు చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. డ్యాం కట్టించి 76 సంవత్సరాలు దాటగా.. ఏటేటా డ్యాంలో పూడిక పెరిగిపోయిందన్నారు. ప్రారంభంలో డ్యాం గరిష్ట నీటి నిల్వ 133 టీఎంసీలు ఉండగా.. పూడిక చేరడంతో 101 టీఎంసీలకు చేరిందన్నారు. డ్యాంలో 30 టీఎంసీల మేర నీరు చేరడానికి వీలు లేకుండా పూడిక చేరిందని పేర్కొన్నారు. ఈసారి మళ్లీ మే నెలలో తుంగభద్ర డ్యాంలో నీటిని ఉపయోగిస్తున్న పరిశ్రమల యజమానులతో కలిసి పూడికతీత పనులు చేపడుతామన్నారు. పెద్ద ఎత్తున రైతులు పూడికతీత చేసేందుకు తరలివస్తారన్నారు. డ్యాంలో పూడిక తీసిన మట్టిన చుట్టుపక్కల గ్రామాలకు చెందిన రైతులు ఉచితంగా తీసుకెళ్లవచ్చని తెలిపారు. తుంగభద్ర డ్యాం గేట్లకు అమర్చిన చైన్‌లను కూడా మార్చాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రైతుల సంఘం నాయకులు జాళిహాల్‌ శ్రీధర్‌, వీరనగౌడ, వీరభద్ర నాయక్‌, దరూరు వీరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement