హొసపేటె: బంగారం ఇస్తామని చెప్పి ఓ వ్యక్తి నుంచి రూ.30 లక్షలు దోచుకుని పరారైన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయడంలో హోసహళ్లి పోలీసులు విజయం సాధించారు. నిందితుల నుంచి రూ.29,50,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. చైన్నెలోని అయ్యప్పాక్కం నివాసి అయిన జి.కుమార్‌కు లింగనహళ్లిలోని కొరచరహట్టికి చెందిన సురేష్ అలియాస్ రమేష్, సోమన్నతో పరిచయం ఉంది. తమకు ఇంటి కూల్చివేత సమయంలో సుమారు కిలో బంగారు ఆభరణాలు దొరికాయని రమేష్, సోమన్న నమ్మబలికారు. మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు బంగారం ఇస్తామని కుమార్‌కు చెప్పారు. జనవరి 28న కాయసనకెరె గ్రామం సమీపంలోని ఒక అటవీ ప్రాంతానికి వస్తే బంగారు ఆభరణాలు ఇస్తామని తెలిపారు. అక్కడికి చేరుకున్న కుమార్ నుంచి నిందితులు బలవంతంగా రూ.30 లక్షలు లాక్కొని పరారయ్యారు. ఈ ఘటనకు సంబంధించి మార్చి 14న హోసహళ్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. విజయనగర జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఎస్.జాహ్నవి, అదనపు పోలీస్ సూపరింటెండెంట్ శ్రీ మంజునాథ్ మార్గదర్శకత్వంలో ఈ కేసు దర్యాప్తు కోసం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు నిందితులు సురేష్ అలియాస్ రమేష్, సోమన్నను అరెస్ట్ చేశారు. కూడ్లిగి డీవైఎస్పీ మల్లేష్ దొడ్డమణి నేతృత్వంలో కొట్టూరు సీపీఐ దురుగప్ప, పీఎస్‌ఐ సిద్ధరామ బిదరాని, సిబ్బంది సభ్యులు అంజన మూర్తి, మంజునాథ్, సురేష్ సహా పలువురు ఆపరేషన్‌లో పాల్గొన్నారు.
రూ.29.50 లక్షల నగదు స్వాధీనం


