హుబ్లీ: రంజాన్ పండుగ రోజు లకామాపురంలో విషాదం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. కెలగెరి వంతెన వద్ద జరిగిన ఈ ప్రమాదంలో లకామాపుర నివాసి ఇమామసాబ్ హెబ్బళి (21) అతడి స్నేహితుడు, మోహ నివాసి యునుస్ ముల్లానవర (17) మృతి చెందారు. ఈ ఘటనతో రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఇమామ్ సాబ్ అన్న పెళ్లి నిశ్చయం అయిన కబ్బార గణవిలోని ఇంటికి పండుగ సందర్భంగా ప్రార్థనల కోసం స్నేహితులతో కలిసి వెళ్లారు. పని ముగించుకుని బైక్‌లో వస్తుండగా కెలగెరి వంతెన వద్ద గుర్తు తెలియని వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇమామ్ సామ్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడి యూనుస్‌ను నగరంలో ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. బైక్‌ను ఢీకొట్టిన అనంతరం సదరు గుర్తు తెలియని వాహనం ఆపకుండా వెళ్లిపోయింది. సదరు వాహన డ్రైవర్ కోసం ధార్వాడ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా పండుగ రోజే ఇద్దరు యువకులు మృత్యువాత పడటంతో లకామాపురలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు దుర్మరణం


