ఉగాండా ఏజెంట్‌తో రన్యారావు డీల్‌ | - | Sakshi
Sakshi News home page

ఉగాండా ఏజెంట్‌తో రన్యారావు డీల్‌

Mar 23 2026 8:51 AM | Updated on Mar 23 2026 8:51 AM

ఈడీ చార్జిషీటులో వెల్లడి

బనశంకరి: కన్నడ నటి రన్యారావు, ఆమె అనుచరులు నిర్వహిస్తున్న బంగారం స్మగ్లింగ్‌ దందాలో ఈడీ విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సుమారు రూ.102 కోట్ల విలువచేసే బంగారాన్ని అక్రమంగా భారత్‌కు తరలించారని ఈడీ కోర్టులో చార్జిషీట్‌ వేసింది. ఇందులో ఉగాండా దేశానికి చెందిన ఏజెంటుతో నటి రన్యకు లింకులు ఉన్నట్లు తెలిపింది.

ఈడీ చార్జిషీటులో పేర్కొన్న ప్రకారం ఆమె దుబాయ్‌ నుంచే కాకుండా ఆఫ్రికన్‌ దేశాల నుంచి కూడా బంగారాన్ని అక్రమంగా తరలించేది. దీనికోసం ఉగాండా ఏజెంట్‌తో సంప్రదించింది. దీనికోసం దుబైలో వీరా డైమండ్‌ ట్రేడింగ్‌ అనే పేరుతో కంపెనీని కూడా తెరిచింది. రన్యారావు స్నేహితుడు రాజు, సదరు ఏజెంట్‌కు అడ్వాన్స్‌గా రూ.33 లక్షలు చెల్లించారు. 2024, జనవరిలో రాజు బంగారం తేవడానికి ఉగాండాకు వెళ్లగా ఆ ఏజెంట్‌ తనకు మరింత ఎక్కువ డబ్బు.. అంటే రూ.1.7 కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ పెట్టినట్లు తెలిసింది. రాజు వట్టిచేతులతో వచ్చాడు. స్మగ్లింగ్‌ కేసుల్లో అరెస్టయిన రన్య బెంగళూరు పరప్పన జైల్లో గడుపుతోంది.

పీడబ్ల్యూడీ ఇంజినీర్‌ మిస్సింగ్‌

దొడ్డబళ్లాపురం: పీడబ్ల్యూడీ ఇంజినీర్‌ గత 8 రోజుల నుంచి కనిపించడం లేదు. కలబుర్గిలోని పీడబ్ల్యూడీ కార్యాలయంలో జేఈ గా పనిచేసే సునీల్‌ హక్కి మిస్సయ్యాడు. 5వ తేదీన మధ్యాహ్నం సునీల్‌ మొబైల్‌ఫోన్‌ని ఇంట్లోనే వదిలి తల్లి వద్ద రూ.15వేలు తీసుకుని బయటకు వెళ్లినవాడు తిరిగి రాలేదు. పలుచోట్ల వెతికినా జాడ లేకపోవడంతో కుటుంబీకుల్లో దిగులు నెలకొంది. ఎంబీ నగర్‌ పోలీసులు గాలింపు చేపట్టారు.

ఠాణాకు చేరిన లంబోర్గిని

డ్రిఫ్టింగ్‌ కేసులో సీజ్‌

యశవంతపుర: బెంగళూరు ఎంజీ రోడ్డులో లంబోర్గిని కారుతో అర్ధరాత్రి డ్రిఫ్టింగ్‌ విన్యాసాలు చేసిన కేసులో కబ్బన్‌ పార్క్‌ పోలీసులు ఆ కారును స్వాధీనం చేసుకున్నారు. మాఫియా డాన్‌ ముత్తప్ప రై కుమారుడు రిక్కీ రై కారును డ్రిఫ్టింగ్‌ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రిక్కీ రై కి నోటీసులు పంపి విచారణకు రావాలని సూచించారు. కారు ఎవరి పేరున ఉందో తెలుసుకోవడానికి ఆర్‌టీఓ అధికారులకు లేఖ రాశారు. ఈ కారుతో ఎంజీ రోడ్డులో గతంలోనూ డ్రిఫ్టింగ్‌ విన్యాసాలు చేసినట్లు అనుమానాలున్నాయి. కారును పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చిన దృశ్యాలు వైరల్‌ అయ్యాయి.

నాపై మూడేళ్లుగా

సీఐ అత్యాచారం

సందేశ్‌పై మహిళ ఫిర్యాదు,

కేసు నమోదు

యశవంతపుర: మహిళలను వేధించిన వ్యవహారంలో దక్షిణ కన్నడ జిల్లా మూడబిదిరె సీఐ పీజీ సందేశ్‌ వివాదం కొనసాగుతూనే ఉంది. వేధింపుల కేసులో ఆయనను సస్పెండ్‌ చేస్తే సరిపోదు, కేసు కూడా పెట్టాలి అని బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దక్షిణకన్నడ జిల్లా బెళ్తంగడి తాలూకా వేణూరు పోలీసులు సందేశ్‌పై అత్యాచారం కేసు నమోదు చేశారు. 2020 నుంచి 2023 మధ్య మూడేళ్లపాటు తన ఇంటికి సందేశ్‌ తరచూ వస్తూ లైంగిక దాడి చేసేవాడని మహిళ ఫిర్యాదులో ఆరోపించడం సంచలనం కలిగిస్తోంది. ఇది జిల్లా పోలీసులకు కూడా తలనొప్పిగా మారింది.

2020లో సందేశ్‌ బెళ్తంగడి సర్కిల్‌లోని వేణూరు పోలీసుస్టేషన్‌ సీఐగా పని చేసేవారు. ఘటన అక్కడే జరగడంతో కేసును అక్కడే నమోదు చేసుకున్నారు. సందేశ్‌పై ఇద్దరు మహిళలు చేసిన లైంగిక వేధింపుల అరోపణలు అవాస్తవమని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. కానీ అంతలోనే రేప్‌ కేసు పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రానురాను ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందోనన్న కుతూహలం వ్యక్తమవుతోంది. అలాగే సీఐని అరెస్టు చేస్తారా అనేది మిస్టరీగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement