దొడ్డబళ్లాపురం: బెంగళూరు పరిధిలో యాక్సిడెంట్లతో రహదారులు నెత్తురోడాయి...మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 7 మంది దుర్మరణం చెందారు.
యూ టర్న్‌లో విషాదం
శనివారం అర్ధరాత్రి బెంగళూరు సమీపంలో దేవనహళ్లి సమీపంలోని రాణి క్రాస్ వద్ద రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు చనిపోగా, 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులను తుమకూరు జిల్లాలోని తిపటూరు తాలూకాకు చెందిన జయమ్మ(60), యశోదమ్మ (60), గంగ (38)గా గుర్తించారు. 12 మంది మహిళలు సీ్త్ర శక్తి సంఘంలో రుణం తీసుకుని కాశీతో పాటు ఉత్తర భారతదేశ యాత్ర చేయాలని నిర్ణయించారు. కెంపేగౌడ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం 6 గంటలకు విమానంలో బయలుదేరాల్సి ఉంది. ఇందుకోసం శనివారం రాత్రి 10గంటల సమయంలో బాడుగ టెంపో వాహనంలో ఎయిర్‌పోర్టుకు బయలుదేరారు. వాహనం డ్రైవర్‌కి ఈ దారి కొత్త కావడంతో మొబైల్‌లో గూగుల్ మ్యాప్ చూసుకుంటూ బయలుదేరాడు. దేవనహళ్లి రాణి క్రాస్ యూటర్న్‌లో గందరగోళానికి గురయ్యాడు. కాస్త ముందుకు వెళ్లి టర్న్ తీసుకోవడంతో వెనుక వేగంగా వస్తున్న లారీ వేగంగా ఢీకొంది. క్యాంటర్ పల్టీలు కొట్టగా అందులోని ముగ్గురు తీవ్ర గాయాలతో చనిపోయారు. గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
వంతెన మీద.. ముగ్గురు మృతి
బెంగళూరు కేఆర్ పురం మేడళ్లి వద్ద శనివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. కేఆర్ పురం సమీపంలోని మేడళ్లి బ్రిడ్జ్‌పైన కోలారు నుండి ఉర్లగడ్డల లోడ్‌తో బెంగళూరుకు వస్తున్న ఈచర్ వాహనం పంక్చర్ కావడంతో రోడ్డుపక్కన నిలిపారు. అదే సమయంలో హొసకోట నుంచి కేఆర్ పురం వస్తున్న టాటా ఇంట్రా వాహనం ఈచర్‌ను వెనుక నుంచి వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో వైట్ ఫీల్డ్‌కి చెందిన మణికంఠ, సురేశ్, శ్రీనివాస్ అనే ముగ్గురు చనిపోయారు.
● బెంగళూరు ఇస్కాన్ వద్ద కమలమ్మనగుండి సమీపంలో 24 ఏళ్ల యువకుడు బైక్ పై వస్తూ డివైడర్‌ను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి అక్కడే మరణించాడు. ఈ ప్రమాదాలపై స్థానిక పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు.
మహిళలతో విమానాశ్రయానికి వస్తున్న టెంపోను లారీ ఢీ
ముగ్గురు మహిళలు దుర్మరణం
8 మందికి తీవ్ర గాయాలు
దేవనహళ్లి వద్ద ప్రమాదం


