రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలోని గ్రామీణ ప్రాంతాల్లో చెరువులకు రక్షణ గోడలు, కంచెలు కరువు కావడంతో అమాయకులైన యువకులు నీటిలో మునిగి బలి అవుతున్నారు. నెల రోజుల్లో సుమారు 60 మందికి పైగా చెరువుల్లో మునిగి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కోకొల్లలు. గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారులు, కార్యదర్శులు ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. రాయచూరు జిల్లాలో 568 చెరువులు, కలబుర్గిలో 985 చెరువులు, యాదగిరి జిల్లాలో 358 చెరువులు, కొప్పళ జిల్లాలో 589 చెరువులు, బీదర్ జిల్లాలో 989 చెరువులున్నాయి. ప్రవాసాంధ్రులు నివసించే క్యాంపుల్లో కూడా చెరువులు నిర్మించుకున్నారు. అధికారికంగా చెరువులకు రక్షణ గోడలు, కంచెలు, తంతులు వేయకుండా అలాగే వదిలేశారు.
వేసవిలోనే ఎక్కువ మరణాలు
వేసవి కాలంలో అధిక శాతం పల్లె ప్రాంతాల్లో ఎండవేడిమి నుంచి ఉపశమనానికి స్నానం చేయడానికి, ఈత కొట్టడానికి వెళతారు. చెరువులో అధిక ప్రమాణంలో పూడిక పేరుకొని ఉంటుంది. సింధనూరు తాలూకా అలబనూరు చెరువు, రాయచూరు తాలూకా మర్చటాళ్ చెరువు, యాదగిరి జిల్లా వడగేర తాలూకా జోళదడగి చెరువులో యువకులు ఈత కొట్టడానికి వెళ్లి పూడికలో కూరుకొని పోవడంతో ఊపిరాడక మృతి చెందిన ఉదాహరణలున్నాయి. గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారులు, కార్యదర్శులు ఈ విషయంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చెరువులకు రక్షణ గోడల నిర్మాణానికి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కళ్యాణ కర్ణాటకలో చెరువుల వద్ద
రక్షణ ఏదీ?
నీటిలో కలిసి పోతున్న యువత ప్రాణాలు
నెల రోజుల్లో 60 మందికి పైగా మరణం


