● నదిలోకి బోరుబావి నీరు వదిలిన అన్నదాత
రాయచూరు రూరల్: రాష్ట్రంలో కరువు నెలకొన్న సమయంలో వానలు కురువక నదులు, బావులు, చెరువులు ఎండి పోయాయి. వేసవి కాలంలో ప్రజలు, పశువులకు నీరు లభించని సమయంలో ఓ రైతు ఏకంగా నదికి బోరుబావి నీరు వదిలిన ఘటన ఉత్తర కర్ణాటకలో చోటు చేసుకుంది. హావేరి జిల్లాలో వరదా నది ప్రవహిస్తుంది. ఎండ వేడిమికి ఇటీవల నది ఒట్టిపోయింది. హావేరి జిల్లా సంగూరు రైతు భువనేశ్వర శిడ్లాపూర్ తన పొలంలోని బోరుబావి నీటిని నదిలోకి వదిలి మానవత్వాన్ని చాటుకున్నారు. తాను నది నుంచి పొందిన నీటిని తిరిగి నదిలోకి వదలి పశువులు, పక్షులకు దాహం తీర్చడానికి అపర భగీరధుడు అయ్యాడు. బోరుబావి నీటిని నదిలో చిన్న చిన్న గుంతలు తవ్వి నీటి నిల్వకు చర్యలు చేపట్టారు. ఆయన చేసిన పనిని గ్రామ ప్రజలు అభినందిస్తున్నారు.


