మైసూరు: మీపై మనీ లాండరింగ్ కేసు నమోదైందని బెదిరించిన ఆన్‌లైన్ నేరగాళ్లు వృద్ధున్ని డిజిటల్ అరెస్టు చేసి రూ.8.50 లక్షలను వసూలు చేసిన ఘటన మైసూరులో జరిగింది. ఇక్కడి నేతాజీనగర నివాసులు బాధితుడు. ఓ దుండగుడు ఆయనకు ఫోన్ చేసి ట్రాయ్ నుంచి అభిషేక్ మిశ్రాను మాట్లాడుతున్నానని చెప్పాడు. మహిళలకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడారు, దీంతో మీపై ముంబై క్రైం బ్రాంచ్‌లో కేసు నమోదైందని బెదిరించాడు. తర్వాత వాట్సాప్ వీడియో కాల్ చేసి మీపై మనీ లాండరింగ్ కేసు నమోదైందని తెలిపాడు. తర్వాత హౌస్ అరెస్ట్ చేస్తామని చెప్పి బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకుని పైమొత్తాన్ని బదలాయించుకుని వంచించాడు. బాధితుడు సైబర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
రూ.1.20 కోట్లు టోకరా, ఒకరి అరెస్టు
● బాగల్‌కోటలో భారీ స్కాం
దొడ్డబళ్లాపురం: షేర్ మార్కెట్‌లో ట్రేడింగ్ పే
రుతో బాగల్‌కోటలో రూ.1.20 కోట్లు కాజేసిన సంఘటన వెలుగు చూసింది. ఈ కేసులో జమఖండి నివాసి ప్రజ్వల్ (25) అనే నిందితున్ని బాగల్‌కోట సైబర్‌క్రైం ఠాణా పోలీసులు అరెస్టు చేశారు. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ నుంచి ఇతడు రూ.1.20 కోట్లు మళ్లించినట్లు ఆరోపణలున్నాయి. జిల్లాలో 1,296 నకిలీ బ్యాంకు ఖాతాలకు ఆ డబ్బు వెళ్లింది. విచారణ కొనసాగుతోంది.
నకిలీ బంగారాన్ని చూపి..
రూ.21 లక్షల బురిడీ
మైసూరు: మైసూరుకు చెందిన రాజ్ చంద్రశేఖర్ అనే వ్యక్తి నకిలీ బంగారాన్ని ఫైనాన్స్ కంపెనీలో కుదువపెట్టి డబ్బులు కొట్టేశాడు. కంపెనీ ప్రతినిధి నజర్‌బాద్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సిద్ధార్ధనగరలోని ఫైనాన్స్ కంపెనీలో నిందితుడు చంద్రశేఖర్ తాను సీఎస్‌బీ బ్యాంకులో బంగారాన్ని రూ.20.60 లక్షలకు తాకట్టు పెట్టానని చెప్పాడు. మీరు ఆ బంగారాన్ని విడిపిస్తే మీకే కుదువ పెడతానని నమ్మించాడు. అతని మాటలను నమ్మిన ఫైనాన్స్ కంపెనీ వారు అతనికి రూ.1 లక్ష ఇచ్చి, బ్యాంకు కు రూ.20.60 లక్షలను చెల్లించి అతని బంగారాన్ని విడిపించి తెచ్చారు. తర్వాత బంగారాన్ని పరిశీలించగా అది పాక్షికంగా నకిలీదిగా తేలింది. దీంతో మోసపోయామంటూ ఠాణాలో ఫిర్యాదు చేశారు.
షేర్ల పేరుతో
రూ.5.22 లక్షల మస్కా
హుబ్లీ: షేర్ మార్కెట్‌లో డబ్బులు పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయంటూ స్థానిక బిడనాల్ నివాసి వినాయక మాగేరి నుంచి సైబర్ దొంగలు రూ.5.22 లక్షలను బదలాయించుకుని టోపీ వేశారు. సదరు వ్యక్తులు వినాయక్‌కు కాల్ చేసి తమ ద్వారా షేర్ మార్కెట్‌లో డబ్బులు పెట్టుబడి పెట్టాలని, బాగా లాభాలు వస్తాయని తెలిపారు. వారి బుట్టలో పడిన వినాయక దశలవారీగా రూ.14.81 లక్షలను కేటుగాళ్లు ఖాతాల్లోకి జమచేశారు.ఆ తర్వాత రూ.9.58 లక్షలు తిరిగి చెల్లించగా, మిగిలిన సొమ్ము పత్తా లేదు. నగర సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
రాష్ట్రంలో పలుచోట్ల సైబర్ నేరాలు


