బొమ్మనహళ్లి: ఇది మానవాళి వినాశనానికి నాందిలా కనిపిస్తోంది, మాకు యుద్ధం వద్దు. బతకడానికి మాకు గ్యాస్ కావాలి, అని కన్నడ సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు వాటాల్ నాగరాజ్ అన్నారు. శనివారం బెంగళూరు నగర జిల్లాలోని ఆనేకల్ తాలూకాలోని అత్తిబెలెలో వివిధ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. మాకు గ్యాస్ కావాలి అంటూ హైవే– 44 మీద ఖాళీ సిలిండర్లు, చెక్క డబ్బాలు ఉంచి నిరసన తెలిపారు. మూడో ప్రపంచ యుద్ధం జరగకూడదన్నారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్, పెట్రోలు వంటి ఇంధన కొరతను నివారించాలని నినాదాలు చేశారు. కన్నడ సంఘాల నేతలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ పరీక్షలను ఇంగ్లిష్, హిందీలో నిర్వహిస్తూ కన్నడిగుల హక్కులను హరించివేస్తోందని ఆరోపించారు.
కట్టెల ధరలు భగ్గు
యశవంతపుర: పశ్చిమాసియా యుద్ధంతో గ్యాస్ సమస్య రోజురోజుకు పెరుగుతోంది. బెంగళూరులో హోటల్స్, క్యాంటీన్ తదితరాలు గ్యాస్ సిలిండర్లు లేక కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తున్నారు. బసవేశ్వరనగరంలోని ఉత్తర కర్ణాటక హోటల్‌లో కలబురగి నుంచి కట్టెలను తెప్పించి వంటలు చేస్తున్నట్లు యజమాని తెలిపారు, కానీ గ్యాస్ సమస్యతో కట్టెల ధరలు కూడ విపరీతంగా పెరిగాయి. గతంలో వంద కేజీల కట్టెలు రూ.2వేలు ఉండగా, ఇప్పుడు 4 వేలకు పెరిగాయని వాపోయారు. బెంగళూరు ఆర్‌ఆర్ నగరలో విష్ణుభవన్ హోటల్‌లో పూర్తిగా కట్టెలతోనే వండుతున్నారు. గ్యాస్ స్టవ్వుతో రెండు గంటలు అయ్యే వంట, కట్టెలపై నాలుగైదు గంటలు పడుతుందని చెప్పారు.
అత్తిబెలెలో ఆందోళన


