పోలీసు అధికారినని చెప్పి.. | - | Sakshi
Sakshi News home page

పోలీసు అధికారినని చెప్పి..

Mar 21 2026 5:00 AM | Updated on Mar 21 2026 5:00 AM

సాక్షి బెంగళూరు: రాష్ట్రంలో రోజురోజుకు డిజిటల్‌ అరెస్టు కేసులు పెరుగుతున్నాయి. గత రెండేళ్లలో ప్రజలు సుమారు రూ.468 కోట్లను ఈ సైబర్‌ కేటుగాళ్ల డిజిటల్‌ అరెస్టులకు భయపడి కోల్పోయారు. రాష్ట్రంలో డిజిటల్‌ అరెస్టులు అనేవే లేవు. ప్రభుత్వం ఎంతగా అవగాహన కల్పిస్తున్నా ప్రజలు మాత్రం కోట్లాది రూపాయలను పోగొట్టుకుంటున్నారు. ప్రతి ఏటా ఈ డిజిటల్‌ అరెస్టు కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది. గడిచిన మూడేళ్లలో మొత్తం 1,695 కేసులు నమోదు కాగా, రూ. 468 కోట్ల మేర నష్టపోయినట్లు హోం శాఖ అధికారికంగా వెల్లడించింది. అలాగే ఇప్పటివరకు 500 మంది సైబర్‌ నేరగాళ్లను అరెస్టు చేసినట్లు, వీరు తెరిచిన 40 వేల నకిలీ బ్యాంకు ఖాతాలను పోలీసులు గుర్తించి వాటిని నిలిపివేసినట్లు తెలిపింది. తాజాగా బెంగళూరులో సైబర్‌ మోసగాళ్లు కొత్త దారిని ఎన్నుకున్నారు. సిటీ పోలీసుల పేరుతోనే డిజిటల్‌ అరెస్టు మోసాలకు పాల్పడుతున్నారు. పోలీసు కమిషనర్‌ నకిలీ సంతకం, సీల్‌ ఉపయోగించి ఒక మహిళను మోసం చేసేందుకు యత్నించారు.

బెంగళూరు సిటీ పోలీసుల పేరిట కూడా..

ఇప్పటివరకు సీబీఐ అధికారులు, ముంబై పోలీసులు లేదా కస్టమ్స్‌ అధికారుల పేరిట జరుగుతున్న డిజిటల్‌ అరెస్టు మోసాలు తాజాగా బెంగళూరు సిటీ పోలీసుల పేరిట జరిగే వరకు వచ్చాయి. పోలీసులు కూడా తరచూ ప్రజలకు డిజిటల్‌ అరెస్టులపై అవగాహన కల్పిస్తున్నారు. అయినప్పటికీ ప్రజల్లో అవగాహన చాలా ఆలస్యంగా కలుగుతోంది. పోలీసులు ఎప్పటికీ వీడియో కాల్‌ ద్వారా ఎవరినీ అరెస్టు చేయరని అధికారులు తెలిపారు. డబ్బుల కోసం ఎవరినీ డిమాండ్‌ చేయరని చెప్పారు. ఇలాంటి డిజిటల్‌ అరెస్టు కాల్స్‌ వస్తే అసలు భయపడాల్సిన పని లేదని హెచ్చరించారు. ఏదైనా అనుమానాస్పద లింక్స్‌ వస్తే వాటిని క్లిక్‌ చేయవద్దని, ఇంటి లొకేషన్‌ కూడా ఎవరికీ షేర్‌ చేయొద్దని సూచించారు. అలాంటి కాల్స్‌ వస్తే సహాయవాణి–1930 అనే నంబరుకి తెలియజేయాలని పోలీసులు కోరారు. ప్రజలు అప్రమత్తమైనప్పుడే ఈ సైబర్‌ నేరాలను అరికట్టవచ్చని వారంటున్నారు.

గత మూడేళ్లలో రూ.468 కోట్లు గల్లంతు

డిజిటల్‌ అరెస్టులతో ప్రజల జేబులకు చిల్లు

రాష్ట్రంలో పెరుగుతున్న ఇలాంటి ఘటనలు

బెంగళూరుకు చెందిన ఓ మహిళకు గుర్తు తెలియని నంబర్‌ నుంచి ఒక ప్రైవేటు టెలీకాల్‌ వచ్చింది. ఫోన్‌ చేసిన వ్యక్తి తనను తాను ఒక పోలీసు అధికారిగా పరిచయం చేసుకున్నాడు. మీ తల్లి ఒక అక్రమ కేసులో పాల్గొన్నారని, ఆమైపె క్రిమినల్‌ కేసు నమోదైందని బెదిరించడం ప్రారంభించాడు. ఆ మహిళను నమ్మించేందుకు సైబర్‌ నేరగాడు ఏకంగా సుప్రీంకోర్టు ప్రతిని, బెంగళూరు నగర పోలీసు కమిషనర్‌ అధికారిక ఆదేశాల ప్రతితో పాటు పలు డాక్యుమెంట్లను వాట్సాప్‌ ద్వారా పంపించాడు. ఈ డాక్యుమెంట్లలో ఏకంగా కమిషనర్‌ నకిలీ సీలు, సంతకాన్ని కూడా ఉపయోగించాడు. అయితే ఈ డాక్యుమెంట్లలో అక్షరదోషాలు, లోగోలో తప్పిదాలు ఉండడంతో అనుమానం వచ్చిన సదరు మహిళ ఈ వీడియో కాల్‌ కట్‌ చేసి నేరుగా బెంగళూరు పోలీసు అధికారిక సహాయవాణికి కాల్‌ చేసింది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ సైబర్‌ క్రైమ్‌ పోర్టల్‌లో కూడా ఫిర్యాదు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement