దొడ్డబళ్లాపురం: కెంపేగౌడ ఎయిర్‌పోర్టుకు వరుసగా మూడవసారి స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్‌పోర్ట్ అవార్డు లభించింది. 2026 సంవత్సరానికి బెస్ట్ రీజనల్ ఎయిర్‌పోర్టు అవార్డు లభించింది. చెక్ ఇన్, బదిలీ, అరైవల్, చిల్లర వ్యాపారం, భద్రత,వలస, డిపార్చర్, ప్రయాణికుల అభిప్రాయాలు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ అవార్డు ప్రకటిస్తారు.
మెట్రో రైల్లో
యువకుల హల్‌చల్
దొడ్డబళ్లాపురం: బెంగళూరులో మెట్రో రైల్లో యువకులు గొడవ చేసిన కారణంగా రైలు ఆలస్యంగా నడిచింది. ఈనెల 15న రాత్రి 10.57 గంటల సమయంలో యువకులు కొందరు మాదావర మెట్రో స్టేషన్‌లో రైలు ఎక్కారు. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా గట్టిగా అరుస్తూ, గొడవ చేస్తుండడంతో బీఎంఆర్‌సీఎల్ సెక్యూరిటీ సిబ్బందికి కొందరు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. స్పందించిన సెక్యూరిటీ సిబ్బంది యువకులను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీసులకు అప్పగించింది. యువకుల గొడవ వల్ల కారణంగా మెట్రో రైలు కొన్ని నిమిషాల పాటు ఆలస్యంగా నడిచింది. ఇందుకు సంబంధించి స్పందించిన బీఎంఆర్‌సీఎల్ తమ ప్రయాణికుల రక్షణ, వారి గౌరవం తమకు ఎంతో ముఖ్యమని ప్రకటించింది.
దూరం పెట్టిందని
కత్తితో పొడిచి హత్య
దొడ్డబళ్లాపురం: ఓ వివాహిత ప్రియుడి చేతిలో హత్యకు గురైన ఘటన బెంగళూరు గంగొండనహళ్లిలో చోటుచేసుకుంది. స్థానికుడు హఫీజ్‌కి వివాహమై పిల్లలు కూడా ఉన్నారు. అయితే భర్తకు దూరంగా ఉంటున్న ఇద్దరు పిల్లలు ఉన్న ఫిర్దోస్ భాను అనే వివాహితతో కొంతకాలంగా సంబంధం కొనసాగిస్తున్నాడు. కుటుంబ సభ్యుల ఒత్తిడితో ఫిర్దోస్ భాను హఫీజ్‌ని దూరం పెట్టింది. హఫీజ్ గొడవ చేయడంతో గతనెల 28న పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు హఫీజ్‌ని హెచ్చరించి వదిలేశారు. గురువారం ఫిర్దోస్ భాను ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా హఫీజ్ అడ్డుకొని కత్తితో పొడిచి హత్య చేశాడు. పోలీసులు వెంటనే స్పందించి నిందితుడిని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.
భార్యపై భర్త యాసిడ్ దాడి
● అడ్డువచ్చిన కుమార్తె, మరో ఇద్దరిపైకూడా
సాక్షి,బళ్లారి: కుటుంబ కలహాల నేపథ్యంలో తనను వదిలి వెళ్లిన భార్యపై భర్త యాసిడ్‌తో దాడి చేశాడు. అడ్డొచ్చిన కుమార్తె, మరో ఇద్దరిపై కూడా యాసిడ్ పోసి మచ్చుకత్తితో దాడి చేసి గాయపరిచాడు. ఈ ఘటన చిత్రదుర్గలో గురువారం రాత్రి కలకలం రేపింది. వివరాలు.. నగరంలోని నెహ్రు కాలనీలో ఆటో డ్రైవర్ మహమ్మద్ సోహైల్, తహసీన్‌భాను దంపతులు నివాసం ఉండేవారు. కుటుంబ గొడవలతో 8 నెలల క్రితం భార్యాభర్తలు వేర్వేరుగా జీవిస్తున్నారు. తహసీన్‌భాను బెంగళూరు వెళ్లిపోయింది. ఇటీవల చిత్రదుర్గలోని తన అక్కకుమారుడికి ఇంటికి పిల్లలతో కలిసి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న సోహైల్ యాసిడ్ తీసుకుని వెళ్లి భార్యపై దాడి చేశాడు. అడ్డు వచ్చిన కుమార్తె, మరో ఇద్దరిపై కూడా యాసిడ్‌తో దాడి చేసి మచ్చుకత్తితో దాడి చేసి గాయపరిచాడు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని నలుగురు బాధితులను చిత్రదుర్గ ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని ఎస్పీ రంజిత్ కుమార్, డీఎస్పీ, సీఐలు పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ యాసిడ్‌తో దాడి చేసిన మహమ్మద్ సోహైల్‌ను అరెస్ట్ చేశామన్నారు.
ప్రముఖ రచయిత్రి
చంపా శివన్న కన్నుమూత
మైసూరు: కన్నడ సాహిత్య పరిషత్ ఎండోమెంట్ అవార్డు గ్రహీత, కవయిత్రి చంపా శివన్న (71) అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూశారు. ఆమెకు కుమార్తె, కవయిత్రి శివరంజని, అల్లుడు ప్రహ్లాద రావు, మనవడు ప్రథమ్ ఉన్నారు. శనివారం ఆమె అంత్యక్రియలు జరుగుతాయి. మైసూరు మిత్ర, స్టార్ ఆఫ్ మైసూరు పత్రికలకు సంపాదకుడిగా పని చేసిన దివంగత ఎం.ఆర్.శివన్న భార్య చంపా శివన్న మృతి కన్నడ కవిత్వ రంగానికి తీరని లోటని మైసూరు వర్సిటీ సిండికేట్ మాజీ సభ్యుడు నింగరాజేగౌడ సంతాపం తెలిపారు.


