ఇఫ్తార్‌ విందు | - | Sakshi
Sakshi News home page

ఇఫ్తార్‌ విందు

Mar 20 2026 7:59 AM | Updated on Mar 20 2026 7:59 AM

రాయచూ రురూరల్‌: రాయచూరులో హిందువులు, ముస్లింలు అనే తేడా లేకుండా అందరూ కలసిమెలసి ఉంటున్నారని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కృష్ణ తెలిపారు. రంజాన్‌ మాసం సందర్భంగా గురువారం నగరంలో ముస్లింలకు మసీదుల్లో ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన ముస్లింలు విందు ఆరగించారు. కార్యక్రమంలో శంకర గౌడ ఐ.పాటిల్‌, రాము, కోరనాళ్‌ తదితరులు పాల్గొన్నారు.

చెరువులో పడి వృద్ధుడు మృతి

డబ్బు కోసమే భర్తను చంపారని భార్య ఆరోపణ

రాయచూరు రూరల్‌: ఈత రాకపోవడంతో వృద్ధుడు నీట మునిగి మృతి చెందిన ఘటన రాయచూరు జిల్లాలో చోటు చేసుకుంది. డబ్బు కోసమే తన భర్తను నీటిలోకి తోసి చంపారని భార్య ఆరోపిస్తోంది. వివరాలు.. మంగళవారం సాయంత్రం మాన్వి నుంచి శబ్జాలి, బాబురావ్‌, చంద్రశేఖర్‌ కలసి ఆటోలో వృద్ధుడు నాగప్ప పూజార్‌ (58) తీసుకెళ్లినట్లు సమాచారం. నాగప్ప వద్ద రూ.50 వేలు నగదు ఉండటంతో వీరే నీటిలోకి తోసి చంపేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నాగప్ప పూజార్‌కి ఎంలాంటి చెడు అలవాట్లు లేవు అని.. బలవంతంగా నాగప్పతో మద్యం తాగించి డబ్బు లాక్కొన్నారని చెబుతున్నారు. విషయం తెలుసుకున్న తాలూకా యంత్రాంగం తెప్ప సహాయంతో గాలింపు చర్యలు చేపట్టింది.

మాజీ కార్పొరేటర్‌ అరెస్ట్‌

హుబ్లీ: బెయిల్‌ తీసుకుని కోర్టులో హాజరుకాకుండా సుమారు 7 ఏళ్ల నుంచి తప్పించుకుని తిరుగుతున్న మాజీ కార్పొరేటర్‌ను ధార్వాడ ఉపనగర పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడిని శ్రీకాంత జమనాళగా గుర్తించారు. ఇతడు ప్రధాన జిల్లా కోర్టు, జేఎంఎఫ్‌సీ కోర్టులో వివిధ సెక్షన్ల మేరకు 2019లో శిక్ష గురై బెయిల్‌ తీసుకున్నాడు. ఆ తర్వాత కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. శ్రీకాంత్‌పై ధార్వాడ ఉప నగర పోలీసులు ప్రస్తుతం వివిధ సెక్షన్ల కింద ఓ క్రిమినల్‌ కేసు దాఖలు చేశారు. అంతేగాక అదే పోలీస్‌ స్టేషన్‌లో రౌడీషీట్‌ కూడా ఉంది. ఇతడి ఆచూకీ కోసం ధార్వాడ ఉపనగర పోలీసులు తీవ్రంగా గాలించారు. ఈనెల 15న ధార్వాడ నగర శివారులో నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతడిని జ్యుడిషియల్‌ కస్టడీకి అప్పగిస్తు ఆదేశాలు ఇచ్చింది.

తెగిన గట్టు పరిశీలన

హొసపేటె: తుంగభద్ర ఎడమ కాలువ గట్టు తెగిపోయిన స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే పరన్న మునవళ్లి పరిశీలించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే గట్టు తెగిపోయిందని, దీనిని వెంటనే మరమ్మత్తు చేయాలని డిమాండ్‌ చేశారు. నీట మునిగిన పొలాల రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని కోరారు. హెచ్‌ఎం.సిద్దరామయ్య స్వామి, హనుమేష్‌ యాదవ్‌, కరుణాకర్‌ వడ్డరహట్టి, చంద్రశేఖర్‌ భట్టద పాల్గొన్నారు.

ఆస్తి కోసం చెల్లెలు దారుణ హత్య

హుబ్లీ: ధార్వాడలో పండగ రోజు విషాదం చోటు చేసుకుంది. ఆస్తి కోసం సొంత చెల్లిని అన్న దారుణంగా హత్య చేసిన ఘటన ఉగాది పర్వదినం రోజున ధార్వాడ తాలూకా అమ్మినబావి గ్రామంలో వెలుగు చూసింది. హతురాలిని శివలీల సంగొళ్లి (35)గా గుర్తించారు. అమ్మినబావి హనుమంత యళవాళ సొంత చెల్లినే మట్టుబెట్టిన కసాయి అన్న. సదరు కుటుంబానికి గ్రామంలో మొత్తం 6 ఎకరాల సాగు పొలం ఉంది. దీనిలో తనకు వాటా కావాలని చెల్లెలు శివలీల కొన్నేళ్లుగా డిమాండ్‌ చేస్తోంది. పండుగ రోజు అయిన గురువారం పొలంలో భూమి పూజ చేయడానికి అన్న, చెల్లెలు కలిసి వెళ్లారు. ఈ రోజు నా వాటా భూమిలో పూజ చేస్తానని శివలీల చెప్పడంతో అన్న హనుమంత ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇద్దరి మధ్య మాటమాట పెరగడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. హనుమంత తన వద్ద ఉన్న మరుణాయుధాలతో చెల్లెలుపై దారుణంగా దాడి చేసి హత్య చేశారు. ధార్వాడ గ్రామీణ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని, పరారీలో ఉన్న నిందితుడు హనుమంత యళవాళ కోసం గాలిస్తున్నారు.

దేవేంద్రప్ప స్వామి ఆత్మహత్య

సాక్షి, బళ్లారి: సింధనూరులో ఓ మఠం అధిపతి దేవేంద్రప్ప స్వామి ఇకలేరు. గురువారం ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేయడంతో గమనించిన భక్తులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దేవేంద్రప్ప స్వామి వ్యక్తిగత, మఠం వ్యవహారాల ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై సింధనూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement