రాయచూరు రూరల్: ముఖం కడుక్కునేందుకు నారాయణపుర కుడి కాలువలోకి దిగిన ఓ బాలుడు ప్రమాదవశాత్తూ జారిపడి మృతి చెందాడు. ఈ ఘటన రాయచూరు జిల్లాలో చోటు చేసుకుంది. సింధనూరు తాలుకా జవుళిగెరకు చెందిన దశరథ్ (9) అమ్మ పుట్టినిల్లు అయిన జావుర్‌కు వచ్చాడు. బుధవారం సాయంత్రం లింగసూగురు తాలుకా రోడల బండి వద్ద ఉన్న నారాయణపుర కుడి కాలువలోకి దిగాడు. చేతులు, కాళ్లు కడుక్కునే క్రమంలో ప్రమాదవశాత్తూ కాలువలోకి జారిపడిపోయాడు. దశరథ్‌కు ఈత రాకపోవడంతో నీట మునిగి చనిపోయాడు. ఈ మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
యువతి కోసం
అన్నదమ్ముల ఘర్షణ
● తమ్ముడిని హతమార్చిన అన్న
రాయచూరు రూరల్: పెళ్లి వయస్సుకు వచ్చిన అన్నదమ్ములు యువతి కోసం గొడవపడ్డారు. కోపంతో ఊగిపోయిన అన్న.. తమ్ముడిని దారుణంగా హతమార్చిన జరిగిన ఘటన గదగ్ జిల్లాలో చోటు చేసుకుంది. చిక్క మూలంగికి చెందిన పక్కీరప్ప (19), అశోక్ (21) అన్నదమ్ములు. నరగుంద తాలుకా హిరేకోప్పలో వీరు గొర్రెలు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పక్కీరప్పకు అదే గ్రామంలో ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. ఇదే విషయంలో ఇద్దరి మద్య వాగ్వాదం చోటుచేసుకుంది. ‘సదరు యువతిని ప్రేమించాను. ఆమెనే పెళ్లి చేసుకుంటా అని’ అశోక్ తెలిపాడు. ఈ విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది. అనంతరం దొడ్డిలో నిద్రిస్తున్న పక్కీరప్ప తలౖపైపె అశోక్ పెద్ద బండరాయితో కొట్టాడు. తీవ్రంగా గాయపడిన పక్కీరప్ప అక్కడికక్కడే మరణించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.
దుకాణాల దగ్ధం
హొసపేటె: విద్యుత్ సర్క్యూట్‌తో కిరాణా దుకాణం, పంక్చర్ షాపు కాలి బూడిదయ్యాయి. గంగావతిలోని ఆనెగొంది రోడ్డులో బసవేశ్వర సర్కిల్ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఎలా జరిగిందనే దానిపై ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు. అయితే అర్ధరాత్రి కిరాణా దుకాణం, పంక్చర్ షాపులో అగ్నిప్రమాదం సంభవించింది. కిరాణా దుకాణంలోని వస్తువులు కాలిపోయాయి. పంక్చర్ షాపులో విలువైన టైర్లు, ట్యూబులు, ఇతర పరికరాలు దగ్ధమయ్యాయి. ఘటనా స్థలానికి వెంటనే చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో రూ.2 లక్షల వరకూ నష్టం వాటిల్లింది.
విపత్తులపై
అప్రమత్తత అవసరం
రాయచూరు రూరల్: జిల్లాలో ఎండల తీవ్రత పెరగడంతో మనుషులు అధిక ప్రమాణంలో నీటిని సేవించాలని జిల్లా పంచాయతీ అదనపు కార్యదర్శి హల సిద్దప్ప పూజారి సూచించారు. జిల్లా పంచాయతీ సభా భవనంలో జిల్లా వైపరీత్యాల ప్రాధికార, మిత్ర గ్రామీణ వికాస్ సంస్థ, జిల్లా పంచాయతీ, జిల్లా అధికారి పాలన యంత్రాగం ఆధ్వర్యంలో ప్రక్కతి వైపరీత్యాల వల్ల జరిగే నష్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. విపత్తులను ఎదుర్కొనేందుకు మానవులు జాగ్రత్తలు పాటించాలన్నారు. చల్లని వాతావారణంలో ఉండేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు. గత ఏడాది కంటే ఈ సంవత్సరం ఎండలు అధికంగా ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో ఈరమ్మ, శ్రీదేవి, శ్రీనివాస, ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


