● ఉరుములు,
వడగండ్లతో కూడిన భారీ వర్షం
● నేలవాలిన వరి పంట
సాక్షి, బళ్లారి: మంగళ, బుధవారాల్లో ఉరుములు, మెరుపులతో వడగండ్ల వర్షం కురిసింది. తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో సాగు చేసిన వరి నేలకూలింది. వరి గింజలు నేల రాలడంతో రైతులు కన్నీరు పెడుతున్నారు. తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో చానాళ్‌కు చెందిన విరుపాక్షి, గణేష్ స్వామి, ముద్దటనూరు సూరిబాబు, బెళగల్లుకు చెందిన శివప్రకాష్ తదితర రైతులు విలేకరులతో మాట్లాడారు. రబీలో ఎకరాకు రూ.40 వేల చొప్పున అప్పు చేసి వరి సాగు చేశామన్నారు. పంట చేతికందే తరుణంలో వర్షాలకు వరి పంట పూర్తిగా దెబ్బతిందన్నారు. రైతులకు ఒక ఎకరానికి కనీసం రూ.50 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రాయచూరు రూరల్: రాయచూరు, యాదగిరి జిల్లాలో కురిసిన వర్షాలకు వరి దెబ్బతింది. మాన్వి, సురుపుర, శహపుర, హుణిసిగి, దేవదుర్గ, సింధనూరు తాలుకాలో వేలాది ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. ప్రభుత్వం ఎకరాకు రూ.25 వేల పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. మద్దతు ధరకు పంట కోనుగోలు చేయాలన్నారు. పంట నష్టం అంచనాలు తయారు చేసి సర్కార్‌కు నివేదికలు పంపాలని తహసీల్దార్‌ను కోరారు.
మామిడి రైతుల కష్టాలు
హుబ్లీ: రెవెన్యూ శాఖ, ఉద్యాన శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి జిల్లా యంత్రాంగానికి సూచనలు చేశారు. వడగండ్ల వాన జిల్లాతో పాటు ఉత్తర కర్ణాటక వ్యాప్తంగా మామిడి సాగు చేసిన రైతులకు నష్టం మిగిల్చిందన్నారు. జిల్లా యంత్రాంగం, ఉద్యానవన శాఖ అధికారులు సదరు రైతులను ఆదుకోవడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.
గాలీవాన బీభత్సం
హొసపేటె: విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి తాలూకా తంబ్రహళ్లి గ్రామంలో బుధవారం రాత్రి గాలీవాన బీభత్సం సృష్టించింది. రైతు ప్రభురెడ్డి రెండు ఎకరాల్లో సాగు చేసిన అరటి పంట పూర్తిగా నాశనమైంది. పంట కోతకు వస్తున్న క్రమంలో వర్షాలకు పంట దెబ్బతింది. సుమారు రూ.8 లక్షల నష్టం వాటిల్లిందని ప్రభురెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.


