‘మనీ డబ్లింగ్‌’ నేరస్తుల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

‘మనీ డబ్లింగ్‌’ నేరస్తుల అరెస్ట్‌

Mar 20 2026 7:59 AM | Updated on Mar 20 2026 7:59 AM

రాయచూరు రూరల్‌: రసాయనాలు, నల్ల రంగు ఉపయోగించి సాదా తెల్ల కాగితాలను అసలైన కరెన్సీ నోట్లుగా మార్చి ప్రజలను మోసం చేస్తున్నారనే ఆరోపణలపై కర్ణాటకలోని బెళగావి జిల్లా పోలీసులు మహారాష్ట్రకు చెందిన ఇద్దరు పోలీస్‌ కానిస్టేబుళ్లతో సహా ఏడుగురిని అరెస్టు చేశారు. గోకాక్‌ నగరం హనుమాన్‌ ఆలయం సమీపంలో ఉన్న ఒక ఇంటిపై మంగళవారం గోకాక్‌ నగర పోలీసులు దాడి చేసి ఈ ముఠాను పట్టుకున్నారు. వీరిలో ఒక వ్యక్తి ఇంకా పరారీలో ఉన్నాడు. పోలీస్‌ సూపరింటెండెంట్‌ కె.రామరాజన్‌ మాట్లాడుతూ.. బెళగావి జిల్లా గోకాక్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ’మనీ డబ్లింగ్‌’ నేరస్తులను అరెస్టు చేయడం జరిగిందన్నారు. గోకాక్‌కు చెందిన ముగ్గురు నిందితులు, నకిలీ పత్రాలతో ప్రజలను మోసం చేసే మహారాష్ట్రకు చెందిన జయశ్రీ బాబు అనే వ్యక్తితో సంబంధాలు కలిగి ఉన్నట్లు తెలిపారు. అసలైన కరెన్సీ నోట్లను తీసుకుని వాటిపై నల్ల రసాయన సిరాను పూసే సాధారణ పద్ధతిని అనుసరించారని పేర్కొన్నారు. వారు దానిని మామూలు నల్ల కాగితంలా కనిపించేలా ఆరబెట్టి.. ఆ నల్ల కాగితం అద్భుతంగా కరెన్సీగా మారిపోతుందని సామాన్య ప్రజలను నమ్మిస్తారని తెలిపారు. వాస్తవానికి అది మొదటి నుంచీ అసలు నోటే.. ఆ తర్వాత నేరగాళ్లు అసలు నల్ల కాగితం కట్టలను (అవి కరెన్సీ కావు) 1:4 నిష్పత్తిలో అమ్ముతారన్నారు. మహారాష్ట్రకు చెందిన ఇద్దరు పోలీస్‌ కానిస్టేబుళ్లు థానేకు చెందిన ఆనంద్‌ ప్రకాష్‌ నర్వాడే, పాల్ఘర్‌కు చెందిన దిలాదర్‌ అబనీషేక్‌కు ఇందులో భాగస్వామం ఉందని వెల్లడించారు. పరశురామ్‌ భీమ్సీ బడకారి (గోకాక్‌), జయశ్రీ బాబు కాంబ్లే (ముంబై), మనీషా రాజు గైక్వాడ్‌ (అహ్మద్‌ నగర్‌), ఉజ్వల్‌ తులసిరామ్‌ బిలానే (జల్గావ్‌) నిందితులుగా గుర్తించడం జరిగిందన్నారు. మొత్తం ఎనిమిది మంది నేరస్తుల్లో ఏడుగురిని అరెస్టు చేయగా.. ఒక స్థానిక నేరస్థుడు ఇంకా పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు. హీటింగ్‌ మెషీన్‌, ద్రావణం, నల్ల కాగితాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. స్థానిక సబ్‌–ఇన్‌స్పెక్టర్‌ కిరణ్‌ మోహిత్‌కు సమాచారం అందిన వెంటనే దాడి చేసి నిందితులను అరెస్ట్‌ చేశారన్నారు. నిందితుల్లో ఒకడైన పరశురామ్‌కు గతంలో జరిగిన మూడు దోపిడీ కేసులతో సంబంధం ఉందని వెల్లడించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు కొనసాగుతోందని ఎస్పీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement