రాయచూరు రూరల్: రెండు రోజుల క్రితం కొప్పళ జిల్లా బసపురం వద్ద తుంగభద్ర ఎడమ కాలువకు గండి పడింది. భారీగా నీరు వృథా అవుతోంది. కాలువకు గండి పడిన ప్రాంతంలో వరి పంట దెబ్బతింది. తుంగభద్ర ఎడమ కాలువ బసపురం వద్ద గండి పడిన ప్రాంతాన్ని రెండు రోజులైన పూడ్చక పోవడంతో ఆ ప్రాంతంలోని రైతులు గురువారం ఆందోళన చేపట్టారు. 60 అడుగుల వెడల్పు, 40 అడుగుల ఎత్తు గండి పడిన ప్రాంతం నుంచి నీరు వృథా అవుతున్నా అధికారులు పట్టించుకోక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గండి పడిన ప్రాంతాన్ని అధికారులు, ఇంజనీర్లు, ప్రజాప్రతినిధులు పరిశీలించ లేదని తెలిపారు. మునిరాబాద్ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు గండి పూడ్చే విషయంలో మౌనం వహించడాన్ని తప్పుబట్టారు. కొప్పళ జిల్లా ఇన్‌చార్జి మంత్రి శివరాజ్ తంగడిగి, విజయనగరం జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్, ఉప ముఖ్యమంత్రి నీటి పారుదల శాఖ మంత్రి డీకే.శివకుమార్ కాలువను మరమ్మతులు చేయించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు.


