జడిపించిన వడగండ్ల వానలు | - | Sakshi
Sakshi News home page

జడిపించిన వడగండ్ల వానలు

Mar 20 2026 7:58 AM | Updated on Mar 20 2026 7:58 AM

మైసూరు: మైసూరు జిల్లాలోని హుణసూరు తాలూకాలోని హనగోడు పరిధిలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షం కురిసింది. పలు గ్రామాలలో అరటి, కొబ్బరి, వక్క తోటలు దెబ్బతిన్నాయి. కరెంటు తీగలు తెగి పలు పల్లెల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. హుణసూరు డివిజన్‌లో మొత్తం 46 ఇతర విద్యుత్‌ స్తంభాలు కూలిపోయాయి.

దాసనపురంలో పాఠశాలలు, ఇళ్లకు నష్టం

● హనగోడు సమీపంలోని దాసనపురంలో, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పైకప్పు పెంకులు ఆకస్మిక వర్షానికి ఎగిరిపోయాయి.

● గ్రామంలో సోమయ్య, శేఖర్‌, మాదేగౌడ, గణేష్‌, ప్రకాష్‌, సోమశేఖర్‌, కుమార్‌, మధు, మాలియ, రవి తదితరుల ఇళ్ల పైకప్పు పెంకులు ఎగిరిపోయి ఆస్తినష్టం సంభవించింది. వర్షంలో గూడు లేకుండా పోయిందని బాధితులు వాపోయారు. చెట్లు పడి ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి.

● కిరంగూర్‌లో స్వామిగౌడ ఇంటి పైకప్పు ఎగిరిపోగా, హైరిగేలోని ఇల్లు కూలిపోయింది.మరో ఇంటిపై కొబ్బరి చెట్టు కూలింది. అనేక గ్రామాల పరిధిలో వడగండ్ల వాన వల్ల పొగాకు పైరు మట్టి కరిచింది.

● తట్టెకెరె దర్శన్‌, శరత్‌ అనే రైతులు పొలం నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా, ఒక చెట్టు కొమ్మ విరిగి పడడంతో గాయపడ్డారు.

● నాగరహోళె అరణ్యంలో వీరన హోసహళ్లి, ఆనెచౌకూర్‌, కల్లాహాల్‌ ప్రాంతాలలో గంటల తరబడి పెద్ద వర్షం పడింది. నష్టపోయిన అన్నదాతలు లబోదిబోమన్నారు. అధికారులు బాధిత ప్రాంతాలలో పర్యటించి నష్టం అంచనా వేశారు.

రాష్ట్రంలో పలు జిల్లాల్లో బుధవారం రాత్రి నుంచి తెల్లవారుజామువరకు భారీ వర్షాలు కురిశాయి. కాలం కాని కాలంలో పడిన వానలతో ఎండల నుంచి ఉపశమనం లభించింది. కొన్నిచోట్ల పంట నష్టం వాటిల్లింది. మైసూరు జిల్లాలోని పలు గ్రామాల్లో వడగండ్ల ధాటికి అనేక ఇళ్లు దెబ్బతినగా, కరెంటు స్తంభాలు కూలిపోయాయి.

మైసూరు, మండ్య జిల్లాల్లో ఆకస్మిక వర్షాలు

పంటపొలాలు, ఇళ్లకు నష్టం

మరో 2 రోజులు వానలే!

శివాజీనగర: రాష్ట్రంలో పలుచోట్ల మరో రెండు రోజులు భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ గురువారం తెలిపింది. బీదర్‌, కల్బుర్గి, యాదగిరి, రాయచూరు, బెళగావి, ధార్వాడ, దావణగెరె, శివమొగ్గ, ఉడుపి, దక్షిణ కన్నడ, చిక్కమగళూరు, హాసన్‌, మైసూరు, బెంగళూరు, తుమకూరు, మండ్య, చామరాజనగర జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని ఆరెంజ్‌ అలర్ట్‌ జారీచేసింది.

బెంగళూరులో భారీ వర్షం

రాష్ట్రంలో పలు చోట్ల బుధవారం భారీ వర్షం కురిసింది. బెంగళూరు ఎంజీ రోడ్డు, కళ్యాణ్‌ నగర, బళ్లారి రోడ్డు, జయనగర, బనశంకరి, మెజిస్టిక్‌, శాంతినగర, కోరమంగల లాంటి ప్రాంతాల్లో వర్షం కురిసింది. సాయంత్రం అందరూ ఇళ్లకు వెళ్లే సమయంలో వాననీరు నిలిచి అవస్థలు పడ్డారు. ప్రధాన రహదారులు, పై వంతెనల మీద ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement