విద్యతోనే అభివృద్ధి సాధ్యం
హొసపేటె: విద్యార్థులు నేర్చుకోడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడితే విద్యాపరంగా పురోగతి సాధించగలరని హరపనహళ్లి ఎమ్మెల్యే లతా మల్లికార్జున అన్నారు. గురువారం నగరంలోని మేగళపేటె ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో డీఎంఎఫ్ గ్రాంట్ కింద రూ.కోటి వ్యయంతో నిర్మించిన 6 పాఠశాల గదులు, రూ. కోటి వ్యయంతో నిర్మించిన థియేటర్ హాల్ ప్రారంభించిన తర్వాత ఆమె మాట్లాడారు. నేర్చుకోవడంతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటే నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. భవిష్యత్తులో జీవితంలో విజయం సాధించడానికి పిల్లలు తమకు ఆసక్తి ఉన్న రంగాన్ని గుర్తించి ఎంచుకోవాలని సూచించారు. హరపనహళ్లి నగరంలో కేంద్ర విశ్వవిద్యాలయాన్ని స్థాపించడానికి నిజాయితీగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విజయనగర జిల్లా హరపనహళ్లి తాలూకా మరియమ్మనహళ్లి మీదుగా శివమొగ్గ వరకు రాష్ట్ర రహదారి నిర్మాణం వల్ల మూడు జిల్లాల మధ్య రవాణా సౌకర్యం సులభతరం అవుతుందని తెలిపారు. మరియమ్మనహళ్లి–శివమొగ్గ రాష్ట్ర రహదారికి మరమ్మతులు లేకపోవడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని అన్నారు. సురక్షితమైన ట్రాఫిక్ కోసం రోడ్డును అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. తాలూకాకు మరిన్ని ఎంపీ గ్రాంట్లు వస్తే నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. బీఈఓ హెచ్.లేపాక్షప్ప, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎంవీ.అంజనప్ప తదితరులు పాల్గొన్నారు.


