అప్పుపై దంపతుల మధ్య గొడవ
హుబ్లీ: అప్పు విషయానికి సంబంధించి దంపతుల మధ్య ఘర్షణ చోటు చేసుకోగా మాటమాట పెరగడంతో పరిస్థితి వికోపానికి దారి తీసి భార్యపై అక్కసుతో రాడ్డుతో కొట్టి చంపి ఇంట్లోనే ఆమె శవాన్ని పాతిపెట్టిన భయానక ఘటన 24 రోజుల తర్వాత విజయపుర జిల్లా దేవర హిప్పరగిలో వెలుగు చూసింది. నిందితుడైన భర్తను ప్రభు రత్నాకర్(46), మృతురాలిని భార్య సరోజిని(45)గా గుర్తించారు. దేవర హిప్పరిగి పోలీసులు కేసు నమోదు చేసుకొని సంబంధిత తహసీల్దార్ తదితరుల సమక్షంలో పూడ్చిన శవాన్ని వెలికితీసి మిగతా ప్రక్రియ ప్రారంభించారు. ఈ కేసును హతురాలి తల్లి కమలవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదు చేసుకున్నారు. భార్య సరోజిని పేరిట ప్రభు యథేచ్చగా అప్పులు చేశాడు. వీటి విషయమై అప్పుడప్పుడు ఇద్దరి మధ్య గొడవ జరిగేది. ఈ క్రమంలో గత నెల 23న రాత్రి ఇద్దరి మధ్య మరో సారి ఘర్షణ జరిగింది. మరుసటి రోజు 24న సరోజిని తలపై ఇనుప రాడ్డుతో భర్త కొట్టి చంపాడు. ఆ తర్వాత ఇంట్లోనే శవాన్ని పాతిపెట్టినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు.
భార్యను చంపి ఇంట్లోనే పాతిపెట్టిన భర్త
24 రోజుల తర్వాత ఘటన వెలుగులోకి


