చిక్కబళ్లాపురంలో బంగారం అన్వేషణ
● హెలికాప్టర్‌తో ముమ్మర సర్వే
చిక్కబళ్లాపురం: బెంగళూరుకు అతి సమీపంలో ఉన్న చిక్కబళ్లాపురం జిల్లాలో బంగారం, ఇతర విలువైన ఖనిజాలు ఏమైనా భూగర్భంలో ఉన్నాయా? అని పరిశోధన జరుగుతోంది. భారతీయ భూవైజ్ఞానిక సర్వేక్షణ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని గుడిబండ తాలూకా బీచగానహళ్లి క్రాస్ పరిసరాల్లో హెలికాప్టర్ ద్వారా సర్వే సాగుతోంది. భూగర్భంలో బంగారు నిక్షేపాలు, ఇతర అరుదైన ఖనిజ సంపదను గుర్తించడమే ఈ సర్వే లక్ష్యం.
బాగేపల్లి తాలూకా, గుడిబండ తాలూకా పరిధిలో బంగారం ఉండొచ్చని గతంలో ప్రచారం సాగింది. భూవైజ్ఞానిక నిపుణుల సూచనలతో సమీక్ష సాగుతోంది. ఓ హెలికాప్టర్‌కు తీగ కట్టి దానికి రాడార్ ఉపకరణాన్ని అమర్చి రౌండ్లు కొడుతున్నారు. హెలికాప్టర్ పదే పదే ఆ ప్రాంతంలో తిరుగుతూ ప్రకంపనల సహాయంతో కనుగొనే పని జరుగుతోంది. హెలికాప్టర్‌ను చూసి జనం సంభ్రమానికి గురవుతున్నారు. పొరుగున ఉన్న కదిరి ప్రాంతంలోనూ సర్వే నిర్వహిస్తున్నారు.
స్వర్ణం ఉండొచ్చా..
కోలారు జిల్లాలోని కేజీఎఫ్ ప్రాంతం మాదిరి మట్టి ఇక్కడ ఉందని, బంగారం దొరికే చాన్సు 80 శాతం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ అదే నిజమైతే ఈ ప్రాంతం చిత్రం సంపూర్ణంగా మారిపోతుందనే ఆశాభావం నెలకొంది. ఇక్కడ భూమిలో 50 మీటర్ల లోపు నుంచి బంగారం ఖనిజం ఉండవచ్చని, వెయ్యి హెక్టార్ల భూమిని బంగారు గనుల కోసం కేటాయించవచ్చని సమాచారం. మే 31వ తేదీ వరకు సర్వే జరుగుతుంది, హెలికాప్టర్ అతి తక్కువ ఎత్తులో ప్రయాణిస్తుంది, ప్రజలు ఎవరూ భయపడవద్దు అని జిల్లా కలెక్టర్ జి ప్రభు తెలిపారు.


