భక్తుల ఇలవేల్పు కోట మల్లేశ్వరుడు
సాక్షి బళ్లారి: నగరంలోని కోట ప్రాంతంలో వెలసిన కోట మల్లేశ్వర స్వామి కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా ప్రతీతి. మహిమాన్విత ఆలయంగా పేరొందిన కోట మల్లేశ్వర స్వామి జాతర, రథోత్సవం అంటే బళ్లారి జిల్లాలోనే కాకుండా చట్టుపక్కల ప్రాంతాల వారు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామిని దర్శించుకుని ఆరాధిస్తారు. కోట మల్లేశ్వర స్వామి ఆలయం, శివుడి విగ్రహం స్వయంభూవుగా వెలసినట్లు పురాణాలు చెబుతాయి. అలాంటి శివలింగం దర్శనం చేసుకుంటే సాక్షాత్తు పరమశివుడి దర్శనం లభించినంత పుణ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఎంతో అద్భుతంగా నిర్మించిన ఈ ఆలయ చరిత్ర ఘనమైనదినే చెప్పుకోవచ్చు. ఏటా మాఘమాసం పౌర్ణమి రోజున రథోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా కోట మల్లేశ్వర స్వామి రథోత్సవాన్ని అంగరంగా వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రథోత్సవం నేపథ్యంలో ఆలయంలో రెండు రోజుల నుంచి ప్రత్యేక పూజలు, అర్చనలు, కల్యాణోత్సవం నిర్వహించారు. ఆలయం కోటలో ఉండగా.. రథోత్సవం తేరువీధిలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తేరు వీధిలో రథోత్సవానికి ప్రత్యేక పూజల అనంతరం పూలతో అలంకరించారు. ఆదివారం ఉదయం మడితేరు, సాయంత్రం మహారథోత్సవం నిర్వహిస్తారు. దాదాపు లక్ష మందికి పైగా జనం పాల్గొనే అవకాశం ఉండటంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ ఆలయ చరిత్ర..
కోట మల్లేశ్వర స్వామి ఆలయానికి ఘనమైన చరిత్ర ఉంది. బళ్లారి తాలూకా హొన్నకోళూరు గ్రామంలోని మల్లయ్య అనే శివ భక్తుడు రోజూ శివపూజ చేయకుండా ఎలాంటి ఆహారం, నీరు సేవించే వాడు కాదు. ఒక రోజు మల్లయ్య తన భావ భరమణ్ణతో కలసి బళ్లారికి వ్యాపారానికి వచ్చాడు. అయితే ఆ రోజు బళ్లారిలోనే ఉండాల్సి వచ్చింది. శివలింగం లేకపోవడంతో దైనందిన కార్యక్రమాలు చేసుకునేందుకు ఇబ్బందులు తలెత్తాయి. వ్యాపారం చేసుకునే మల్లయ్య సేరును శివుడిగా భావించి పూజలు చేశాడు. దీన్ని చూసిన భరమణ్ణ ఇది శివలింగం కాదు.. సేరుకు పూజలు చేయడం ఏమిటని అపహాస్యం చేశాడు. అయితే మల్లయ్య సేరు కాదు.. ఇది సాక్షత్తు శివుడు అని చెప్పాడు. అనుమానం ఉంటే పరీక్షించు అన్నాడు. సేరును తీయడానికి భరమణ్ణ ప్రయత్నించగా అక్కడ శివలింగం ఏర్పడింది. ప్రకాశవంతమైన శివలింగం, నందీశ్వరుడు ఉద్భవించాయి. సేరు ఆకారంలో ఉండే శివుడు శివలింగ రూపంలో అవతరించడంతో మల్లయ్య పూజించాడు. అక్కడ ఉద్భవించిన శివలింగం కాలక్రమేణ కోట మల్లేశ్వర స్వామిగా రూపాంతారం చెందాడు. పురాతన కాలం నుంచి కోట మల్లేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవం, రథోత్సవం జరగడం ఆనవాయితీగా వస్తుంది.
ఆలయంలో నిర్మించిన గోపురం
కోట మల్లేశ్వర స్వామి ఆలయ ముఖద్వారం
కోట ప్రాంతంలో స్వయంభూవుగా వెలసిన శివుడి విగ్రహం
నేడు రథోత్సవం
ఏర్పాట్లు పూర్తి చేసిన
ఆలయ నిర్వాహకులు
లక్ష మందికి పైగా
భక్తులు వచ్చే అవకాశం
భక్తుల ఇలవేల్పు కోట మల్లేశ్వరుడు
భక్తుల ఇలవేల్పు కోట మల్లేశ్వరుడు
భక్తుల ఇలవేల్పు కోట మల్లేశ్వరుడు


