భర్త చేతిలో భార్య హతం
హొసపేటె: తాలూకాలోని కమలాపుర సమీపంలోని వెంకటాపుర క్యాంప్ వద్ద జరిగిన ఇంటి వివాదం కారణంగా భార్యాభర్తలు తీవ్రంగా గొడవపడగా, చివరికి భర్త చేతిలో భార్య హతమైన ఘటన బుధవారం జరిగింది. గుండ్లకెరె టీబీ బోర్డు క్వార్టర్స్ వద్ద నివాసం ఉంటున్న సెల్వకుమార్ అనే వ్యక్తి కొద్ది రోజులుగా భార్య ఝాన్సీ(26)తో తరచు గొడవ పడుతూండేవాడు. చివరికి గొడవ తారస్థాయికి చేరడంతో భర్త తన భార్యను కత్తితో పొడిచి చంపి పరారయ్యాడు. అతని ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. విజయనగర జిల్లా ఎస్పీ ఎస్.జాహ్నవి, డీఎస్పీ డాక్టర్ మంజునాథ్ తళ్వార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై కమలాపుర పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
దివ్యాంగుల్లో ఆత్మస్థైర్యం పెంపొందించాలి
రాయచూరు రూరల్ : సమాజంలో దివ్యాంగుల్లో ఆత్మస్థైర్యం, నైతిక విలువలు పెంపొందించాలని అదనపు జిల్లాధికారి శివానంద పేర్కొన్నారు. బుధవారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో ఏర్పాటు చేసిన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించి మాట్లాడారు. సందర్భానుసారంగా నైతిక విలువల గురించి ప్రజలకు వివరించడానికి ముందుకు రావాలన్నారు. దివ్యాంగుల్లో అగాధమైన జ్ఞానం దాగి ఉందని, ప్రతిభకు తగ్గట్టు సవాల్‌ను సమానంగా స్వీకరించే మనస్తత్వం కలిగి ఉండాలన్నారు. ఉన్నత విద్యను పొంది ఉద్యోగాలను సంపాదించి సొంత కాళ్లపై నిలబడి అందరి మన్ననలను పొందాలన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి నవీన్ కుమార్, దివ్యాంగుల సంక్షేమ అధికారి శ్రీదేవి, దండెప్ప బిరాదార్, రియాజుద్దీన్‌లున్నారు.
హాస్టల్ వ్యవస్థను బలపరచండి
రాయచూరు రూరల్: రాయచూరులో అధ్వానంగా మారిన హాస్టల్ వ్యవస్థను బలోపేతం చేయాలని రాష్ట్ర చలవాది మహాసభ మహిళా విభాగం జిల్లాధ్యక్షురాలు అర్చన డిమాండ్ చేశారు. బుధవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో మాట్లాడారు. హాస్టళ్లలో శుభ్రత నశించిందని, నాసిరకం ఆహార ధాన్యాలు, తాగునీటి ఎద్దడి, మరుగుదొడ్ల సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్నారని ఆరోపించారు. హాస్టల్ వార్డెన్లు 3 నెలల నుంచి విద్యార్థులకు మాసిక వేతనాలు ఇవ్వకుండా అధికారులే నిధులను దుర్వినియోగ పరిచారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లాధికారి నితీష్‌కు వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో లక్ష్మి, మీనాక్షిలున్నారు.
2025కు వీడ్కోలు.. 2026కు స్వాగతం
సాక్షి బళ్లారి: 2025వ సంవత్సరం ముగిసిపోవడంతో గురువారం 2026వ సంవత్సరంలోకి అడుగు పెట్టనుండడంతో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. బుధవారం రాత్రి 12 గంటల తర్వాత యువకులు పెద్ద ఎత్తున చేరి కేక్‌లను కట్ చేసి నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. జిల్లా ఎస్పీ శోభారాణి నేతృత్వంలో గట్టి పోలీసు బందోస్తును ఏర్పాటు చేశారు. ఆయా బేకరీల వద్ద కేక్‌లను కొనుగోలు చేసేందుకు జనం క్యూ కట్టారు. 2026కు స్వాగతం పలుకుతూ సంబరాలు చేసుకొన్నారు.
నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా గట్టి భద్రత
కొత్త ఏడాది సంబరాల్లో మునిగి తేలిన యువత
భర్త చేతిలో భార్య హతం


