అసౌకర్యాల నిలయం బిమ్స్
రాయచూరు రూరల్: బీదర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల(బిమ్స్) ఆస్పత్రిలో వైద్య సేవలు ప్రైవేటు పరమా? అనే మీమాంస ప్రతి ఒక్కరి మదిలో మెదులుతోంది. పేరుకు మాత్రమే ప్రభుత్వ ఆస్పత్రి. వైద్యులు అన్ని రకాల పరీక్షలను, మందులను, మాత్రలను బయటకు చీటీలు రాసి పంపుతుండడాన్ని రోగులు, ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ ఆస్పత్రికి కర్ణాటకతో పాటు పొరుగున ఉన్న తెలంగాణ, మహారాష్ట్రల నుంచి కూడా రోగులు పెద్ద సంఖ్యలో వస్తారు. ఆరు అంతస్తుల భవనంలో వైద్యులు వైద్య విద్యార్థులకు బోధనతో పాటు రోగులకు వైద్య సేవలందిస్తున్నారు. ఇక్కడి వైద్యులంతా ప్రైవేట్ నర్సింగ్ హోంలు, క్లినిక్‌లను నడుపుకుంటున్నారు. బిమ్స్‌లో రోగులను మెరుగైన వైద్య చికిత్సల కోసం ప్రైవేట్ ఆస్పత్రులకు రావాలని రోగులకు సూచిస్తున్నారు. ఇదే అదనుగా భావించిన ఫార్మసిస్టులు మందుల షాపులో రోగులు చీటీలు ఇచ్చినా ప్రభుత్వం సరఫరా చేయడం లేదని బయట మందుల దుకాణాల్లో తీసుకోవాలని చెబుతున్నట్లు రోగులు వాపోతున్నారు. ఈ విషయంలో జిల్లా ఇంచార్జి మంత్రి ఈశ్వర్ ఖండ్రె, వైద్య విద్యా శాఖ మంత్రి శరణ ప్రకాష్ పాటిల్, ప్రజా ప్రతినిధులు మౌనం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోగులకు కేటాయించిన వార్డులు అసౌకర్యంగా ఉన్నాయి. వార్డులను శుభ్రపరచకుండా, మరుగుదొడ్లలో పాచి పేరుకుని రోగులు కాలు జారి కిందపడితే అడిగే నాథుడే లేకుండా పోయాడు. తాగునీటి ఎద్దడి అధికంగా ఉంది. అయినా బిమ్స్ అదికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
పరిశుభ్రతను కాపాడలేని డీన్
నోరు మెదపని ప్రజాప్రతినిధులు
ఆస్పత్రిలో అరకొరగా వైద్య సేవలు
మరుగుదొడ్లు, తాగునీటి ఎద్దడి సమస్య
అసౌకర్యాల నిలయం బిమ్స్


