జిల్లాలో నిరుద్యోగం పోలేదు
సాక్షి,బళ్లారి: రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన బళ్లారి జిల్లాలో నిరుద్యోగ సమస్య, పేదరికం తాండవిస్తోందని, జిల్లాలో అపారమైన ఇనుప ఖనిజ నిల్వలు, పరిశ్రమలు ఉన్నా వాటి యజమానులు స్థానికులకు 70 శాతం ఉద్యోగాలు ఇస్తున్నామని తప్పుడు సమాచారం ఇచ్చి మోసం చేస్తూ తమ ప్రాంత నిరుద్యోగుల పొట్టగొడుతున్నారని నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి అసెంబ్లీలో ఆరోపించారు. మంగళవారం సాయంత్రం బెళగావిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జిల్లాలో నెలకొన్న నిరుద్యోగ సమస్య, జిల్లా మైనింగ్ ఫండ్‌పై ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం, పేదలు విద్యుత్ బిల్లులు కట్టలేక ఇబ్బందులు పడుతున్న సంఘటనలపై తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వాన్ని నిలదీశారు. జిల్లాలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఉన్నా ఉపాధి అవకాశాలు లేక ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నారన్నారు. ఒక కమిటీ వేసి సమగ్ర తనిఖీ నిర్వహించి, పరిశ్రమల యజమానులు చేస్తున్న మోసం ఎండగట్టి, స్థానికులకు న్యాయం చేయాలని సూచించారు. ఉత్తర కర్ణాటక ప్రాంతంపై ప్రభుత్వానికి సవతి తల్లి ధోరణి వద్దు అని హితవు పలికారు. జిల్లాలో నిధులకు కొరత లేదని, మైనింగ్ ఫండ్ అపారంగా ఉందన్నారు. అయితే వాటిని ఉపయోగించుకోవడానికి సరైన చర్యలు తీసుకోవడం లేదన్నారు. తక్షణం మైనింగ్ ఫండ్‌ను జిల్లా అభివృద్ధికి ఖర్చు చేసేందుకు వీలు కల్పించాలన్నారు. నగరంలో స్లం ప్రాంతాల్లో విద్యుత్ బిల్లులు చెల్లించడానికి పేదలకు ఇబ్బందులు తలెత్తున్నాయన్నారు. ఆయా పెండింగ్ బిల్లులపై వడ్డీని మాఫీ చేసి అసలును మాత్రమే కంతుల వారీగా కట్టేందుకు అవకాశం కల్పించి పేదలకు న్యాయం చేయాలని కోరారు.
స్థానికులకే పరిశ్రమల్లో ఉద్యోగాలివ్వాలి
అసెంబ్లీలో ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి


