త్యాగం, సేవలోనే నిజమైన సంపద
మండ్య: జిల్లాలో మళవళ్లిలో సుత్తూరు మఠం శివయోగి స్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారంనాడు రాష్ట్రపతి ముర్ము పాల్గొని ప్రసంగించారు. సుత్తూరు మఠం ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని ప్రశంసించారు. భవిష్యత్తులో బలమైన భారతదేశాన్ని నిర్మించడానికి మఠాలు యువతను ప్రేరేపించాలని అన్నారు. గతకాలంలో సాధువులు, మునులు తమ జ్ఞానం, కరుణతో మానవాళిని ప్రకాశవంతం చేశారు. నిజమైన గొప్పతనం అధికారంలో, సంపదలో లేదు, త్యాగం, సేవ, ఆధ్యాత్మిక బలంలో ఉందని వారి జీవితాలు మనకు గుర్తు చేస్తున్నాయి. అటువంటి గొప్ప సాధువులలో శివయోగి మహాస్వామీజీ కాంతి, ప్రేరణ దీపస్తంభంలా ప్రకాశిస్తున్నాయి అని పేర్కొన్నారు. నేటి వేగవంతమైన, మార్పులు, అని శ్చితితో కూడిన యుగంలో, సామాజిక సామరస్యం, నైతిక నాయకత్వం, యువత సాధికారత , అంతర్గత స్థిరత్వాన్ని పెంపొందించడానికి ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం చాలా అవసరమని రాష్ట్రపతి తెలిపారు. పురోగమిస్తున్న భారతదేశానికి సాంకేతిక శక్తి, విలువల బలం రెండూ అవసరమని చెప్పారు. మన యువత, వారి శక్తి, సృజనాత్మకత, విలువలు, వ్యక్తిత్వం మన గొప్ప బలమని తెలిపారు.
శివయోగిస్వామి సేవలు అనన్యం: గవర్నర్ గెహ్లాట్
మండ్య: ప్రపంచంలోని అనేక దేశాలు ఆధ్యాత్మికత, మానసిక శ్రేయస్సు కోసం భారతదేశం వైపు చూస్తున్నాయి. మన సంస్కృతి ఎల్లప్పుడూ సార్వత్రికమైనది, సోదరభావం, శాంతి, సమానత్వం మరియు సామరస్యాన్ని ప్రేరేపిస్తుందని గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ అన్నారు. ఈ జయంతి వేడుకల్లో గవర్నర్ మాట్లాడారు. సుత్తూరు మఠం భక్తికి, శక్తికి నిలయమని అన్నారు. దేశంలోని అత్యంత ప్రసిద్ధ మఠాలలో ఒకటని కొనియాడారు. శివయోగి స్వామీజీ భారతీయ సాధు సంప్రదాయానికి ప్రకాశవంతమైన స్తంభం వంటివారు, ఆయన జీవితమంతా కరుణ, త్యాగం, తపస్సు, ప్రజా సంక్షేమానికి అంకితం చేయబడిందని చెప్పారు. మానవులలో మానవత్వాన్ని మేల్కొల్పడమే ఆయన లక్ష్యం అని ఆయన అన్నారు. ప్రస్తుత మఠాధిపతి శివరాత్రి దేశికేంద్ర మహాస్వామి సేవలను గవర్నర్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు స్వాములు, వేలాదిగా భక్తులు పాల్గొన్నారు.
సుత్తూరు మఠంలో రాష్ట్రపతి ముర్ము


