187 స్థానిక సంస్థలకు త్వరలో ఎన్నికలు
శివాజీనగర: గడువు ముగిసిపోయి ఒక నెల గడిచిన పట్టణ పంచాయితీ, పురసభ, నగరసభలతో పాటుగా రాష్ట్రంలో 187 నగర స్థానిక సంస్థలకు త్వరలోనే ఎన్నికలు జరుపనున్నట్లు పురపాలక శాఖ మంత్రి రహీంఖాన్ ఎగువసభలో తెలిపారు. రిజర్వేషన్ నిర్ధారణల వల్ల ఆలస్యం జరుగుతోందన్నారు. త్వరలోనే ఖరారు చేసి ఎన్నికలను నిర్వహిస్తామన్నారు. అంతవరకు పరిపాలనకు ప్రత్యేక అధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు. దక్షిణ కన్నడ జిల్లాలో 2 పురసభలు, 3 పట్టణ పంచాయితీల కాలావధి పూర్తయిందని చెప్పారు.
యూట్యూబర్‌పై పోక్సో కేసు
సాక్షి,బళ్లారి: ఉత్తర కర్ణాటకలో ట్రెండింగ్ యూట్యూబర్‌గా పేరుగాంచిన జానపద గాయకుడు మైలారితో పాటు ఏడు మందిపై పోక్సో కేసు నమోదైంది. బాగల్‌కోటె జిల్లా మహాలింగపుర లాడ్జిలో ఓ బాలికపై అత్యాచారం చేసి, వీడియో తీసినట్లు ఆరోపణలు ఉన్నాయి. గ్రామంలో ఆర్కెస్ట్రాలో పాల్గొనేందుకు వచ్చిన మైలారితో పాటు బాలిక కూడా పాల్గొంది. తరువాత ఆమెను లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు చిక్కోడి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు కావడంతో బాగల్‌కోటె జిల్లా మహాలింగపురకు కేసును బదిలీ చేశారు.
మహిళా రైతు బలవన్మరణం
మైసూరు: జిల్లాలోని సాలిగ్రామ తాలూకా కాళమ్మన కొప్పలులో జయమ్మ (59) అనే మహిళా రైతు ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. జయమ్మ ఈనెల 11న తన కుమార్తె ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. కుమారుడు శేఖర్ సాలిగ్రామ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈనెల 14న తాలూకాలోని చుంచనకట్టె గ్రాఫైట్ ఇండియా కాలువ వద్ద ఎవరో మహిళ మృతదేహం లభించినట్లు చెప్పగా వెళ్లి చూసి తన తల్లి అని గుర్తించాడు. పొగాకు సాగు చేసేందుకు కేరళాపుర కెనరా బ్యాంకులో రూ.4 లక్షలను, మరికొంత ఆమె అప్పులు చేశారు. అప్పుల బాధ ఎక్కువై ఆత్మహత్య చేసుకున్నట్లు కుమారుడు ఫిర్యాదు చేశాడు.
కొత్త ఇంటిలో నగల చోరీ
మైసూరు: జిల్లాలోని నంజనగూడులోని సూర్యోదయ నగర బడావణెలో ప్రభుత్వ టీచర్లు జయప్రకాష్ దంపతుల ఇంట్లో చోరీ జరిగింది. ఇటీవల కొత్త ఇంటికి మారారు. బంగారు ఆభరణాలతో సహా పీఠోపకరణాలను కొత్త ఇంటికి తరలించారు. మరుసటి రోజు వెళ్దామని పాత ఇంటిలో నిద్రించారు. ఉదయాన్నే రాగా కొత్త ఇంటికి రాగా తలుపు తాళాలు పగులగొట్టి ఉన్నాయి. లోపలకు వెళ్లి చూడగా సుమారు రూ.10 లక్షల విలువ చేసే 180 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు తేలింది. దొంగలు రాత్రి వేళ కత్తులు, రాడ్లు పట్టుకుని చొరబడినట్లు సీసీ టీవీ కెమెరాలలో రికార్డయింది. స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేశారు.


