నేలరాలుతున్న రైతన్నలు
బనశంకరి: నేలతల్లిని నమ్ముకున్న కర్షకులు అప్పుల బాధతో నేల రాలిపోతున్నారు. 2023–24 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 2,809 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వ్యవసాయ మంత్రి ఎన్.చలువరాయస్వామి విధానసభలో తెలిపారు. జాతీయ నేర గణాంకాల నమోదు బ్యూరో ప్రకారం కర్ణాటక రైతులు ఆత్మహత్యల్లో దేశంలో రెండవ స్థానంలో ఉందని, గత మూడేళ్లతో పోలిస్తే తగ్గుముఖం పట్టాయని మంత్రి తెలిపారు.
హావేరిలో అత్యధికం
అత్యధికంగా హావేరిలో 297 మంది, బెళగావిలో 259, కలబుర్గిలో 234, ధార్వాడలో 195, మైసూరులో 190 మంది అన్నదాతలు తనువు చాలించారు. ప్రభుత్వం 2023–24లో 1,081 మంది రైతుల కుటుంబాలకు రూ.54 కోట్లు, 2024–25లో 896 కుటుంబాలకు రూ.44.8 కోట్లు, 2025 నవంబరు నాటికి 193 కుటుంబాలకు రూ.9.65 కోట్లు పరిహారంగా అందించిందని తెలిపారు. కొందరికి పరిహారం చెల్లించడం ఆలస్యమైందని అంగీకరించారు. 2023–24 లో 164 కుటుంబాల దరఖాస్తులను తిరస్కరించారు.
2023 నుంచి 2,809 మంది
ఆత్మహత్యలు
అసెంబ్లీలో వ్యవసాయ మంత్రి వెల్లడి


