గదగ్ కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపు
హుబ్లీ: గదగ్ జిల్లాధికారి కార్యాలయానికి బాంబు పెట్టినట్లు బెదిరిస్తూ ఈ–మెయిల్ రావడంతో పోలీసులు తక్షణమే అప్రమత్తమయ్యారు. దీంతో గదగ్ జిల్లాధికారి కార్యాలయ యంత్రాంగంలో ఆందోళన నెలకొంది. పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత ఎలాంటి పేలుడు వస్తువులు కనిపించక పోవడంతో ఇదంతా ఒత్తిదే అని, వట్టి బెదిరింపులకు భయపడేది లేదని జిల్లాధికారి తేల్చి చెప్పారు. సోమవారం ఉదయం 10 గంటలకు జిల్లాధికారి అధికారిక ఈ–మెయిల్‌కు ఈ బెదిరింపు సందేశం వచ్చింది. అర్నా అశ్విన్ అనే పేరుతో పంపిన ఈ–మెయిల్‌తో జిల్లా యంత్రాంగ భవనంలోని 5 కీలక చోట్ల బాంబులు పెట్టామని నిందితుడు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న తక్షణమే పోలీసులు బాంబు నిష్క్రియ దళం, శ్వానదళంతో విచ్చేసి ఘటన స్థలాన్ని అణువణువున గాలించారు. అనుమానం ఉన్న వస్తువులను తొలగించారు. పరిశీలన కార్యాచరణలో డీఎస్పీ ముర్తుజా ఖాజీ, సీఐలు లాల్‌సాబ్, సిద్దరామేశ్, ఎస్‌ఐ పవార్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. కాగా పోలీసులు ఈ బెదిరింపు మెయిల్ పంపిన వారి ఆచూకీని కనుగొనేందుకు సైబర్ దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతానికి జిల్లాధికారి కార్యాలయంలో విధులన్నీ సామాన్యంగానే సాగుతున్నాయి.


