పడకలు జాస్తి.. వసతులు నాస్తి
సాక్షి,బళ్లారి: రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వాస్పత్రుల్లో ఒకటిగా పేరుగాంచిన, ఉత్తర కర్ణాటకలో ప్రముఖంగా రోగులకు వరంగా మారిన బీఎంసీఆర్‌సీ ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది కొరత రోగులకు శాపంగా మారింది. దాదాపు 50 సంవత్సరాల క్రితం విమ్స్ ఆస్పత్రిగా, ప్రారంభంలో 100 పడకల ఆస్పత్రిగా అవతరించిన ఈ విమ్స్ ఆస్పత్రిని క్రమేణా 1500 పడకల ఆస్పత్రిగా ఆప్‌గ్రేడ్ చేయడంతో పాటు ఆస్పత్రి పేరును కూడా బళ్లారి మెడికల్ కాలేజీ అండ్ రిసెర్చ్ సెంటర్(బీఎంసీఆర్‌సీ)గా రూపాంతరం చేస్తూ, ఇక్కడ పని చేసే వైద్యులు, సిబ్బందిని పక్కనే నూతనంగా నిర్మించిన ట్రామా కేర్ ఆస్పత్రికి కూడా ఇక్కడ వైద్యులు, సిబ్బందిని నియమించి వైద్య సేవలు అందిస్తున్నారు. ట్రామా కేర్ ఆస్పత్రిలో రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు, ఎముకలకు సంబంధించిన చికిత్సలు, కాళ్లు విరిగినా, మోకాళ్లకు సంబంధించిన వ్యాధులతో పాటు అన్ని రకాల చికిత్సలకు ఇక్కడ సేవలు అందిస్తున్నారు. ఇటీవల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని కూడా ప్రారంభించారు.
తగినంత మంది వైద్య సిబ్బంది లేరు
బెంగళూరు తరహాలో బళ్లారిలో కూడా వైద్య సేవలు అందించేందుకు వీలుగా రోగులకు అన్ని రకాల చికిత్సలు, పరీక్షలు చేసేందుకు ఏర్పాటు చేసిన అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభించారు కాని అక్కడ తగినంత మందిని వైద్యులను నియమించలేదు. బీఎంసీఆర్‌సీ, ట్రామా కేర్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి అనే మూడు ప్రధానమైన ఆస్పత్రుల్లో వసతుల మాట అటుంచితే కనీసం వైద్యులు, సిబ్బంది కొరత కూడా పెద్ద సమస్యగా మారింది. బీఎంసీఆర్‌సీలో వైద్య సేవల కోసం ఒక్క బళ్లారి జిల్లాకు చెందిన రోగులు మాత్రమే వస్తున్నారనుకుంటే పొరపాటు. ఇక్కడికి బళ్లారి జిల్లాతో పాటు చిత్రదుర్గ, విజయనగర, కొప్పళ, రాయచూరు తదితర జిల్లాలతో పాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని సరిహద్దు తాలూకాలకు చెందిన వారు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి చికిత్స చేయించుకుని వెళుతుంటారు. ప్రతి రోజు సుమారు 500 మందికి పైగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి చికిత్సలు చేయించుకుని వెళుతుండటం సర్వసాధారణంగా మారింది.
బీఎంసీఆర్‌సీలో వేధిస్తున్న వైద్యులు, సిబ్బంది కొరత
అందని మెరుగైన వైద్యం.. ఫలితంగా రోగులకు శాపం
పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారిన వైనం
కొరత ఉందని అమాత్యులే సెలవిచ్చారు
ఆస్పత్రిలో 288 వివిధ విభాగాలకు చెందిన వైద్యులు, 858 వివిధ విభాగాలకు చెందిన సిబ్బందితో పాటు 23 మంది దంత వైద్యుల కొరత ఉందని స్వయంగా అసెంబ్లీలో విధాన పరిషత్ సభ్యుడు వై.ఎం.సతీష్ అడిగిన ప్రశ్నకు సంబంధిత శాఖ మంత్రి శరణు ప్రకాష్ పాటిల్ చెప్పడం గమనార్హం. ఇంత పెద్ద సంఖ్యలో వైద్యుల కొరత వేధిస్తున్నప్పటికీ మాటల వరకే పరిమితం అవుతున్నారు కాని ఆస్పత్రిలో పూర్తి స్థాయిలో వైద్యులను నియమించడంలో తగిన చొరవ తీసుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. ఉత్తర కర్ణాటకు చెందిన వ్యక్తే సంబంధిత వైద్య, ఆరోగ్య శాఖకు మంత్రిగా ఉన్నప్పటికీ తూతూమంత్రంగా ఇలా వచ్చి అలా వెళ్లిపోతుండడంతో పాటు సమస్యలపై చర్చిస్తారే కాని వాటిని ఏవిధంగా పరిష్కరించాలన్న దానిపై దృష్టి పెట్టకపోవడంతో బీఎంసీఆర్‌సీ ఆస్పత్రిలో ఇతర సమస్యలు కుప్పలు, తెప్పలుగా ఉన్నప్పటికీ కనీసం వైద్యులు, సిబ్బంది కొరతను కూడా తీర్చకపోతే రోగులకు ఎలా వైద్యం అందిస్తారు? అనే విషయం ప్రశ్నార్థకంగా మారింది.
సర్కార్‌కు చీమ కుట్టినట్లయినా లేదు
ఇంతటి ఘనమైన ఆస్పత్రిలో సమస్యలు రాజ్యమేలుతున్నా పాలకులకు చీమ కుట్టినట్లు కూడా లేకపోవడంతో పాటు అసెంబ్లీలో పలుమార్లు పాలక, ప్రతిపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలు ప్రశ్నల వర్షం కురిపించి, సమస్యలపై గళం విప్పినప్పటికీ సంబంధింత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తగిన విధంగా స్పందించకపోవడంతో రోగులకు సరైన విధంగా వైద్యం అందడం లేదనే విమర్శలు ఉన్నాయి. బీఎంసీఆర్‌సీ ఆస్పత్రిలో ఏటేటా పడకల సంఖ్య పెంచుతుండగా వైద్యులు తగినంత మంది పని చేస్తున్నారా? లేదా? అన్న విషయంపై కూడా ఇక్కడ పని చేసే అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. బీఎంసీఆర్‌సీలో ఆర్థో, న్యూరో, హార్ట్, జనరల్ సర్జన్, చిన్న పిల్లల వైద్యులు, కంటి డాక్టర్లు, గైనకాలజిస్టులు తదితర విభాగాల్లో హెచ్‌ఓడీలతో పాటు దాదాపు 450 మంది వైద్యులను నియమించాల్సి ఉండగా, ప్రస్తుతం 162 మంది వైద్యులే పని చేస్తున్నారు. 1072 మంది ఇతర సిబ్బందిని నియమించాల్సి ఉండగా, కేవలం 213 మందిని మాత్రమే నియమించుకుని వారితోనే సేవలు చేస్తున్నారు.


