యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
రాయచూరు రూరల్: రాయచూరు, కలబుర్గి, యాదగిరి జిల్లాల్లో అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా సాగుతున్న అధికారులు, ప్రజా ప్రతినిధులు మౌనం దాల్చారు. ఈ జిల్లాల్లో తుంగభద్ర, కృష్ణా, భీమా నదులున్నాయి. జిల్లాలోని మాన్వి, రాయచూరు, దేవదుర్గ, యాదగిరి జిల్లా సురపుర, యాదగిరి తాలూకాలో ఆయా నదీ తీరంలోని ప్రాంతాల్లో రోజుకు వందలాది టిప్పర్ల ద్వారా ఇసుక రవాణా యథేచ్ఛగా సాగుతోంది. జోళదడగి, కర్కిహళ్లి, పర్వతాపూర్‌లలో కాంట్రాక్టర్లు పీ.ఎల్.కాంబ్లె, పంచాక్షరి, శివప్ప బసప్ప, ఆనంద్ దొడ్డమని స్టాక్ యార్డులకు నది నుంచి ఇసుకను దొంగతనంగా తరలించి నిల్వ చేసుకుంటున్నారని సామాజిక కార్యకర్త హనుమంతు ఆరోపించారు. పట్టపగలే నదిలో జేసీబీలు, పొక్లెయిన్ల ద్వారా గుంతలు పడేలా ఇసుకను తవ్వుతున్నారు. రాయల్టీని రెండు వాహనాలకు పొంది మిగిలిన వాహనాలకు లేకుండా వందల కొద్దీ టన్నుల మేర సరఫరా చేస్తున్నారు. కొంత మంది కాంట్రాక్టర్లు నేరుగా ఇసుకను తరలిస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో రూ.కోట్లాది మేర కోత పడుతోంది. ఈ విషయంలో జిల్లాధికారి, ఎస్పీ, తహసీల్దార్లు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. శాసనసభ, లోక్‌సభ, జిల్లా పంచాయతీ సభ్యుల కుటుంబాలు ఇందులో కుమ్మక్కు కావడం వల్ల అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. అక్రమంగా ఇసుక రవాణా సరఫరా వల్ల నదులు కనుమరుగు అవుతాయనే భయం ప్రజల్లో ఉంది. ఇటీవల దేవదుర్గ తాలూకా చప్పలికి గ్రామంలో ఇసుక రవాణాను అడ్డుకున్న రైతులపై కాంట్రాక్టర్ దాడి చేశారు.
ప్రభుత్వ రాబడికి భారీ ఎత్తున కోత
నోరు మెదపని అధికారులు, పాలకులు
యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా


