ముఖ్యమంత్రి మార్పు ఉండదు
శివాజీనగర: వాన నిలిచినా చినుకులు నిలవలేదన్నట్లుగా సీఎం కుర్చీ మార్పు గురించి ఎవరూ మాట్లాడరాదని కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశించినా కూడా నాయకులు ఊరికే ఉండడం లేదు. సీఎం సిద్దరామయ్య తనయుడు, ఎమ్మెల్సీ యతీంద్ర ఇటీవల సీఎంగా మా తండ్రి పూర్తికాలం ఉంటారని ప్రకటించడం, దీంతో రభస రేగడం తెలిసిందే. సీఎం సిద్దు కుమారునికి బెళగావిలో గంటకు పైగా కూర్చోబెట్టుకుని ఇది తగదని సూచించారు. ఇది జరిగి రెండురోజులు కాకముందే యతీంద్ర గురువారం మళ్లీ పాత పాటే పాడారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు లేదని ఆయన అన్నారు. బెళగావిలో విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి మార్పునకు హైకమాండ్ అంగీకరించలేదని చెప్పుకున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు లేదు. అలాగే అధికారం కోసం కీచులాటలు జరగడం లేదు అని అన్నారు. నేను ఇదివరకే మీకు చెప్పాను, అంతా స్పష్టంగా ఉంది, హైకమాండ్ సీఎంను మార్చడం లేదు అని ప్రకటించారు. ఈ ప్రకటనతో కాంగ్రెస్ నేతల్లో ఆశ్చర్యం వ్యక్తమైంది. డీసీఎం డీకే శివకుమార్ వర్గం ఎమ్మెల్యేలు, నాయకులు ఆగ్రహంతో ఉన్నారు.
ఆగని భోజన విందులు
భోజన విందులు బెళగావికి కూడా విస్తరించాయి. బుధవారం ఎమ్మెల్యే ఫిరోజ్ సేఠ్ ఇంటిలో సీఎం అనుకూల వర్గం విందు జరిగింది. ఇందులో సీఎం సిద్దరామయ్య, మంత్రులు జమీర్ అహ్మద్ ఖాన్, భైరతి సురేశ్, విధానసభ స్పీకర్ యూ.టీ.ఖాదర్, ఎమ్మెల్సీ సలీం అహ్మద్ పాల్గొన్నారు. ఇది రాజకీయం విందు భోజనం కాదు, ఫిరోజ్ ఆహ్వానంతో విందుకు పిలిస్తే వెళ్లారు అని మంత్రులు చెప్పారు.
హైకమాండ్ బలహీనత: ఎమ్మెల్యే హుస్సేన్
యతీంద్ర మాటలపై రామనగర కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ మండిపడ్డారు. మేము మాట్లాడితే నోటీస్ ఇస్తారు, ఆయన మాట్లాడవచ్చా.., మా హైకమాండ్ బలహీనంగా ఉంది అని అన్నారు. అన్నింటినీ హైకమాండ్ తీర్మానం చేస్తుంది. యతీంద్ర వ్యాఖ్యల వెనుక ఎవరున్నారో తెలియడం లేదు. పదే పదే అవే మాటలు చెబుతున్న ఆయననే అడగండి అని విలేకరులతో చెప్పారు. మేము నోరెత్తితే బలాత్కారం, ఆయన మాట్లాడితే చమత్కారమని దుయ్యబట్టారు.
సీఎం తనయుడు యతీంద్ర మళ్లీ మాటల జోరు
కాంగ్రెస్‌లో ప్రకంపనలు
ముఖ్యమంత్రి మార్పు ఉండదు
ముఖ్యమంత్రి మార్పు ఉండదు


