వధువుల కోసం మలబార్ కలెక్షన్
సాక్షి, బెంగళూరు: పెళ్లిలో వధువుకు అత్యంత ఇష్టమైన ఆభరణాలను వినూత్న డిజైన్లలో అందించేందుకు ప్రతిష్టాత్మక బంగారు, వజ్రాభరణాల సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సిద్ధమైంది. 15వ బ్రైడ్స్ ఆఫ్ ఇండియా సిరీస్‌ను మలబార్ ప్రారంభించింది. ప్రతి ఏడాది తరహాలోనే పెళ్లిళ్ల సీజన్‌కు కొత్త హంగులు అద్దడంతో పాటు కుటుంబాల్లో జరిగే వేడుకలకు సరికొత్త మెరుపులతో మెలుగు జిలుగులకు దోహదపడతాయని తెలిపింది. ఈ ప్రత్యేక 15వ సీజన్ సందర్భంగా తయారీ చార్జీలపై 30 శాతం రాయితీ, వజ్రాలపై 30 శాతం వరకు రాయితీని అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఈ ఆఫర్లు, డిస్కౌంట్లు జనవరి 16 వరకు అందుబాటులో ఉంటాయి.
సైబర్ నేరగాళ్ల వల..
విద్యార్థి ఆత్మహత్య
దొడ్డబళ్లాపురం: నగ్న ఫోటోలు వైరల్ చేస్తామని బెదిరించడంతో భయపడ్డ ఎంబీఏ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెంగళూరు ఉత్తర తాలూకా హెసరఘట్టలోని శాంతినగరలో చోటుచేసుకుంది. కేరళకు చెందిన మోహన్ (25) మృతుడు. వివరాలు.. స్థానిక ప్రైవేటు కాలేజీలో ఎంబీఏ రెండో ఏడాది చదువుతూ ఉండేవాడు. అయితే సైబర్ నేరగాళ్లు ఓ యువతి ద్వారా అతనికి వీడియో కాల్స్ చేస్తూ హనీ ట్రాప్‌లోకి లాగినట్లు సమాచారం. ఆమె తరచూ కాల్స్ చేసి డబ్బులు వసూలు చేసేది. రూ.25 వేలు పంపినట్లు తెలిసింది. మరింత డబ్బు పంపాలని, లేదంటే న్యూడ్ కాల్స్‌ను వైరల్ చేస్తామని బెదిరించడంతో భయపడిపోయాడు. బుధవారం సాయంత్రం డెత్‌నోట్ రాసి ఉరివేసుకున్నాడు. డెత్‌నోట్‌లో మూడు మొబైల్ నంబర్లు ఉన్నాయి. మాదనాయకనహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
మరో 60 ఇండిగో
విమానాల క్యాన్సిల్
దొడ్డబళ్లాపురం: బెంగళూరు కెంపేగౌడ ఎయిర్‌పోర్టులో గురువారంనాడు కూడా 60 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. కేఐఏ నుంచి బయలుదేరాల్సిన 28 విమానాలు, ఇక్కడకు రావాల్సిన 32 విమానాలు క్యాన్సిల్ కావడంతో వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ప్రయాణికులకు ముందుగానే సమాచారం ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇక బుధవారం 58 విమానాలు రద్దయ్యాయి.
మాదప్పకు
రూ.2.53 కోట్ల ఆర్జన
మైసూరు: చామరాజనగర జిల్లా హనూరు తాలూకా మలె మహదేశ్వర బెట్టలోని స్వామివారికి కనకవర్షం కొనసాగుతోంది. దేవస్థాన హుండీలను లెక్కించారు. ఈసారి 28 రోజుల్లో రూ.2.53 కోట్లు భక్తుల నుంచి కానుకల రూపంలో జమ అయ్యాయి. రూ.2.53 కోట్ల నగదు, 25 గ్రాముల బంగారం, 1,253 గ్రాముల వెండి సొత్తు హుండీలలో ఉన్నాయి. చలామణిలో లేని రూ.2 వేల నోట్లు 3, 16 విదేశీ కరెన్సీ నోట్లు లభించాయి. ఆన్‌లైన్ హుండీ ద్వారా రూ.7 లక్షలు జమైంది. శాంత మల్లికార్జున స్వామి, అధికారులు రఘు, చంద్రశేఖర్, మరిస్వామి, గురుమల్లయ్య, పోలీసులు పాల్గొన్నారు.
మాల్ నిర్మాణానికి
రాజమాత బ్రేక్
మైసూరు: నగరంలోని వస్తు ప్రదర్శన ప్రాధికార ఆవరణలో యూనిటీ మాల్ నిర్మాణానికి వ్యతిరేకంగా మైసూరు రాజమాత ప్రమోదాదేవి హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చారు. 6.5 ఎకరాల్లో స్వదేశీ హస్త కళాకృతుల ఉత్పత్తుల విక్రయాల కోసం యూనిటీ మాల్ నిర్మాణానికి ఎంపీ యదువీర్ భూమిపూజ చేశారు. పీపీపీ నమూనాలో రూ.193 కోట్ల వ్యయంతో 36 స్టాళ్లతో ఏర్పాటవుతుంది. 2027 నాటికి పూర్తి కావాల్సింది. అయితే ఆ స్థలం మైసూరు ప్యాలెస్‌కు చెందినదని ఎంపీ యదువీర్ తల్లి, రాజమాత ప్రమోదాదేవి ఒడెయర్ హైకోర్టును ఆశ్రయించారు. ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టరాదని పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను విచారణ చేపట్టిన హైకోర్టు ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేయరాదని, యథాతథ స్థితిని కాపాడాలని స్టే జారీచేసింది. దీంతో అన్ని పనులు నిలిచిపోయాయి. జిల్లా కలెక్టర్ లక్ష్మికాంత్‌రెడ్డి మాట్లాడుతూ త్వరలో హైకోర్టుకు వెళ్లి ఆ స్టేను తొలగించేందుకు ప్రయత్నిస్తామన్నారు.


