సమగ్ర సమాచారంతో హాజరు కండి
హొసపేటె: అధికారులు సమగ్ర సమాచారంతో సమావేశానికి హాజరై పక్కా సమాచారాన్ని అందించాలని తాలూకా పంచాయతీ కార్యనిర్వహణాధికారి మార్కండేయ తెలిపారు. మంగళవారం కూడ్లిగి పట్ణణంలోని తాలూకా పంచాయతీ హాలులో జరిగిన కేడీపీ సమావేశానికి అధ్యక్షత వహించి ఆయన మాట్లాడారు. సంబంధిత శాఖ అధికారులు మాత్రమే సమావేశానికి హాజరు కావాలన్నారు. మీ దిగువ స్థాయి అధికారులను పంపవద్దు, వారి వద్ద శాఖ గురించి సమగ్ర సమాచారం ఉండదు. మీరు కూడా ముందుగా తమకు పూర్తి సమాచారం ఇవ్వాలన్నారు. సగం సగం సమాచారం ఇవ్వవద్దని ఆయన ఆదేశించారు. ప్రస్తుత నెలలో మీరు ఎన్ని బాల్య వివాహాలను నివారించారో, ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి అని సీడీపీఓని ప్రశ్నించారు. ఈ విషయంపై ఆయన బదులిస్తూ ఈ నెలలో 5 బాల్య వివాహాలను నివారించామని బదులిచ్చారు. ఒక బాలికకు 13 సంవత్సరాల వయస్సు మాత్రమే ఉన్నందున ఆమెను హొసహళ్లి బీసీఎం హాస్టల్‌కు తరలించామన్నారు. కానీ అధికారులు ఆమెను హాస్టల్‌లో చేర్చుకోవడానికి వెనుకాడుతున్నారని అధికారి మాలంబీ బదులిచ్చారు. తాలూకాలో ఎక్కువ మంది కూలీ కార్మికులు ఉన్నారు. పౌష్టికాహార లోపం ఉన్న పిల్లలు ఎంత మంది ఉన్నారు. గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వం పౌష్టికాహారాన్ని అందిస్తోందా? అనే మార్కండేయ ప్రశ్నకు సీడీపీఓ సమాధానమిస్తూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేంద్రాల్లో పౌష్టికాహారం అందిస్తున్నట్లు తెలిపారు. ఇతర శాఖల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.


